సాఫ్ట్‌వేర్ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే మాటలు మనం వినే ఉంటాం. కానీ హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో ఓ వ్యక్తి ఏకంగా వర్క్ ఫ్రమ్ బైక్ అంటూ నడిరోడ్డుపై ప్రాణాంతక విన్యాసానికి తెరలేపాడు. బైక్ నడుపుతూ.. దానికి ముందు భాగంలో ల్యాప్‌టాప్‌ను అమర్చుకుని, రోడ్డుపై వెళ్తూనే ఆఫీస్ పనులు, కోడింగ్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లైకులు, వ్యూస్ కోసమో లేదా ఆఫీస్ డెడ్‌లైన్ల ఒత్తిడి వల్లో తెలియదు కానీ అత్యంత ప్రమాదకరమైన రీతిలో చేసిన ఈ నిర్వాకంపై ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.'ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదికి వస్తుంది' అనే పాత సామెతను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారుడి ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా.. అది కేవలం సదరు వాహనదారుడి ప్రాణాలకే కాకుండా పక్కన వెళ్లే ఇతర అమాయక ప్రయాణికుల భద్రతకు కూడా పెను ముప్పని ఆయన హెచ్చరించారు. ఏ పనికైనా ఒక పద్ధతి, సమయం ఉంటాయని, కానీ ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే సామెతలు అక్షరాలా నిజమనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు నింపుకోవడానికి చేసే ఉద్యోగం, కడతేర్చేలా ఉండకూడదని ఉద్యోగులకు హితవు పలికారు.కార్పొరేట్ కంపెనీలలో డెడ్‌లైన్లు, విపరీతమైన పని ఒత్తిళ్లు ఉన్నాయనే సాకుతో ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడటం ముమ్మాటికీ నేరమేనని సజ్జనార్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ తరహా దృశ్యాలు యువతను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. దయచేసి బైక్‌లపై లేదా కార్లలో ప్రయాణించేటప్పుడు ల్యాప్‌టాప్‌లు ఓపెన్ చేయడం, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫోన్లు మాట్లాడటం వంటి పనులు పూర్తిగా మానేయాలని పిలుపునిచ్చారు. 'మీరు క్షేమంగా ఇళ్లకు తిరిగి వస్తారని మీ కోసం ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. దాన్ని గుర్తుంచుకొని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి' అని సజ్జనార్ సూచించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం సదరు బైకర్‌పై ట్రాఫిక్ పోలీసులు కఠినమైన జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.