అమెరికా- ఇరాన్ డీల్.. 3 నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే..

Wait 5 sec.

: చాలా రోజుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇన్ని రోజుల పాటు రెండు దేశాల మధ్య భీకర దాడులు జరగ్గా.. ఇప్పుడు ఎట్టకేలకు ఒక ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీనిపై ఇటీవల ప్రకటన చేశారు. ఒప్పందానికి అతి చేరువలోకి వచ్చాయని.. అతి త్వరలోనే జెనీవా వేదికగా ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిని 30 రోజుల్లోగా తెరిచేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. దాదాపు 5 నెలలు మూసివేసి ఉన్న హార్ముజ్ జలసంధి.. జులై చివర్లోగా తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.హార్ముజ్ జలసంధి తెరుచుకుంటే క్రూడాయిల్ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తొలగిపోతాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 86 డాలర్ల స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది దాదాపు 3 నెలల కనిష్ఠ స్థాయి కావడం విశేషం. ఇంకా తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో దీనిని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై భారం గణనీయంగా తగ్గనుంది. కిందటి రోజుతో పోలిస్తే ఇప్పుడు క్రూడాయిల్ ధర దాదాపు 5 శాతం తగ్గిందని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఇలా 90 డాలర్ల దిగువ స్థాయికి పడిపోయింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభానికి ముందు క్రూడాయిల్ ధర కేవలం 70 డాలర్ల దిగువ స్థాయిలో ఉండగా.. యుద్ధం మొదలైనప్పటి నుంచి పెరుగుతూనే వెళ్లాయి. ఈ క్రమంలోనే ఒక దశలో 125 డాలర్లకు చేరడం గమనార్హం. అక్కడి నుంచి మళ్లీ వరుసగా తగ్గుతూ వస్తోంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) క్రూడ్ ధర 4 శాతానికిపైగా తగ్గడంతో బ్యారెల్‌కు ఇది 84 డాలర్లకు చేరింది. క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మే నుంచి భారత్‌లో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్ని 3 దఫాల్లో కలిపి లీటరుపై రూ. 7.50 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్రూడాయిల్ ధరలు ఇంకా తగ్గితే ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ రూ. 115.73 గా ఉండగా.. డీజిల్ లీటరుకు రూ. 103.82 గా ఉంది. ఢిల్లీలో చూస్తే పెట్రోల్ లీటరుకు రూ. 102.12 పలుకుతోంది. విజయవాడలో అత్యధికంగా రూ. 117.48 గా ఉంది.