రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన వెంటనే.. బీజేపీ సీఎంను కలిసిన టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్

Wait 5 sec.

: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాల్లో మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం నాడు ఆమె తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు సమర్పించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మతో బేటీ అయ్యారు. దీంతో ఈ వార్త కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ పూర్తి వివరాలు మీకోసం. రాజీనామా చేసిన వెంటనే పొలిటికల్ ట్విస్ట్..!సుష్మితా దేవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కొద్ది సేపటికే ఈశాన్య రాష్ట్రాల రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆమె నేరుగా దేశ రాజధాని ఢిల్లీలో అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంపీ పదవిని వీడిన గంటల వ్యవధిలోనే బీజేపీ ముఖ్యమంత్రితో సమావేశం కావడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె త్వరలోనే తృణమూల్ కాంగ్రెస్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పి.. కాషాయ గూటికి చేరడం దాదాపు ఖాయమనే ఊహాగానాలు దేశ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ నుంచి టీఎంసీ దాకా సుష్మితా ప్రస్థానం..!సుష్మితా దేవ్ అస్సాం రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అస్సాం కాంగ్రెస్ దిగ్గజం, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె అయిన సుష్మిత.. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అస్సాంలోని సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి.. 2021లో ఆమె మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన అతి తక్కువ కాలంలోనే ఆమెకు మమత పెద్దపీట వేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు పశ్చిమ బెంగాల్ వెలుపల పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఆమెకు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా కట్టబెట్టారు. అంతగా ప్రాధాన్యత దక్కినప్పటికీ.. ఆమె ఇప్పుడు సడన్‌గా పదవిని వీడటం వెనుక టీఎంసీ అంతర్గత విభేదాలు లేదా సొంత రాష్ట్ర రాజకీయాలపై ఆమెకున్న ఆసక్తే కారణం కావచ్చని తెలుస్తోంది.ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. అటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనా లేక బీజేపీలో చేరికకు సంబంధించిన ముందస్తు వ్యూహమా అనేది రాబోయే కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఏదేమైనా పార్లమెంట్ వేదికగా జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టాలని చూస్తున్న మమతా బెనర్జీకి సొంత ఎంపీలు.. వరుస రాజీనామాలు చేస్తూ షాకుల మీదు షాకులు ఇస్తున్నారు.