తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. ఏపీ, తమిళనాడుల్లో కంటే భిన్నంగా బీజేపీ వ్యూహాలు

Wait 5 sec.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పదే పదే తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని.. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హస్తం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేంద్రమంత్రి అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేసి.. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రకటనగా కాకుండా.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు బీజేపీ అవలంబిస్తున్న దీర్ఘకాలిక వ్యూహానికి సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇతర పార్టీలపై ఆధారపడకుండా.. సొంతంగానే బీజేపీని నిలబెట్టాలని దృష్టి పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తాజాగా అమిత్ షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలు.. మరీముఖ్యంగా తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని కూడా అమిత్ షా తేల్చి చెప్పినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ.. ఎక్కువకాలం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడటం వల్ల.. స్వతంత్రంగా బలాన్ని పెంచుకోలేకపోయామనే భావన బీజేపీ అగ్రనాయకత్వానికి వచ్చిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే ఇతర పార్టీలపై ఆధారపడకుండా.. బీజేపీ బలాన్ని సొంతంగా పెంచాలని యోచిస్తున్నట్లు అమిత్ షా వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. అప్పటికప్పుడు ఎన్నికల సమయంలో కొన్ని సీట్లు, ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చినప్పటికీ.. దీర్ఘకాలంలో మాత్రం అవి బీజేపీని ఎదగకుండా అడ్డుకుంటున్నాయనే ఆలోచనకు బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల ద్వారా సీట్లు, అధికారాన్ని దక్కించుకోవడం కంటే.. కాస్త ఆలస్యమైనా సరే సొంతంగా కేడర్, ఓటు బ్యాంకును సాధించాలనే లక్ష్యంతో కమలం పార్టీ అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ పార్టీగా ఉన్న శాశ్వతంగా నిలదొక్కుకోవాలంటే.. ఇతర పార్టీలపై ఆధారపడకుండా సొంత బలంతో ఎదగాల్సిందేననే బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుందని అభిప్రాయపడుతున్నారు.తెలంగాణలో ఇక త్రిముఖ పోరుఅమిత్ షా చేసిన ప్రకటనతో ఇప్పుడు తెలంగాణలో త్రిముఖ పోరు నెలకొననుంది. నిజంగానే బీజేపీ పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే.. తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరుగా కొనసాగనున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.