తమిళనాడులో సంచలనం.. ఒకే రోజు మద్రాసు హైకోర్టుకు 34 మంది ఐఏఎస్‌లు.. కారణం ఏంటి?

Wait 5 sec.

తమిళనాడులోని వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు, వివిధ శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రెటరీలు సహా మొత్తం 34 మంది ఐఏఎస్‌లు ఒకే రోజు మద్రాసు హైకోర్టుకు హాజరయ్యారు. జూన్ 5న వీరంతా వివిధ కేసులకు సంబంధించి హైకోర్టులో న్యాయమూర్తుల ఎదుట హజరైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. సివిల్ సర్వెంట్లు కోర్టు ధిక్కరణ ఆరోపణల కేసుల్లో హైకోర్టుకు వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌‌లు ఒకేరోజు కోర్టుకు న్యాయమూర్తుల ఎదుట నిలబడటం భారతదేశ చరిత్రలోనే తొలిసారి అని మద్రాస్‌ హైకోర్టు న్యాయ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి ఇంత మంది ఐఏఎస్‌లు హైకోర్టు హాజరుకావడం తీవ్రచర్చకు దారితీసింది. ఈ అధికారులు రోజంతా కోర్టులో వేచి ఉండి... తాము హాజరైనట్లు నమోదు చేయించుకున్నారు. హైకోర్టు వర్గాల ప్రకారం.. ఇటీవలే వేరే జిల్లాకు బదిలీ, ఇంకా బాధ్యతలు తీసుకోని ఓ మహిళా కలెక్టర్‌‌ను సైతం హాజరుకావాలని ఆదేశించడంతో ఆమె విమానంలో వచ్చి హాజరైనట్లు చెబుతున్నారు. అయితే, తదుపరి విచారణకు తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. అనంతరం ఆమె తాను బదిలీ అయిన జిల్లాకు వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు.ఎలాంటి తప్పుచేయని అధికారులపై విధించిన మరో శిక్షణాత్మక చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఆదేశాలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకుని, ఆపై అధికారుల వివరణలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వారిపై విచారణ జరిపి ఉండవచ్చు కదా? అని అంటున్నారు. ముఖ్యంగా కోర్టులు 'హైబ్రిడ్ విధానం' (భౌతిక, వర్చువల్ విచారణ) అవలంబించాల్సి ఉన్నప్పుడు, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారి హాజరును నమోదు చేయడం సాధ్యం కాలేదా? ఈ ఆనాలోచిత చర్య వల్ల ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో విలువైన పని గంటలు వృథా అయ్యాయని, ఆ రోజు ఎలాంటి పని కూడా జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, తమిళనాడులో ప్రభుత్వం మారడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి జోసెఫ్ విజయ్ సైతం ఎటువంటి ఉదాసీనతకు తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెబుతున్నారు. సమన్లపై ప్రభుత్వ అధికారులు కోర్టుకు హాజరైనప్పటికీ, వారి కేసులను వెంటనే విచారణకు స్వీకరిస్తారనే గ్యారెంటీ ఉండదు. అలాగే కోర్టు ప్రొసీడింగ్స్ కోసం వేచి ఉన్న సమయంలో కూర్చోడానికి కూడా కనీస వసతి ఉండదు. అందుకోసమే, 2024లో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన కోర్టు విచారణల కోసం సుప్రీంకోర్టు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రూపొందించింది.సమాచారాన్ని దాచడం లేదా తప్పుగా చూపడం వంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ అధికారులను వ్యక్తిగతంగా కోర్టుకు పిలిపించాలని ఆదేశించింది. అలాగే హాజరుకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని, వ్యక్తిగత హాజరు అవసరమయ్యే కేసుల్లో కోర్టులు వీలైనంత వరకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలని సూచించింది.