పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Wait 5 sec.

ఉద్యోగుల, అధ్యాపకుల పదవీ విరమణ వయసు పెంపుదల వ్యవహారంపై కీలక తీర్పును వెలువరించింది. రిటైర్మెంట్ వయసును నిర్ణయించడం లేదా పెంచడం అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, చట్ట పరిధిని దాటి ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత విద్యామండలి పరిధిలోని యూనివర్సిటీల ప్రొఫెసర్లకు పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం జారీ చేసిన జీవో 3ని తమకూ వర్తింపజేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్‌ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు వేర్వేరుగా దాఖలు చేసిన 13 పిటిషన్లపై జస్టిస్‌ కె.శరత్ విచారణ జరిపి ఈ తుది తీర్పును ఇచ్చారు.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో మొత్తం 17 యూనివర్సిటీలు ఉండగా.. కేవలం ఈ మూడు యూనివర్సిటీలను వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ మినహాయించి మిగిలిన అన్ని వర్సిటీల్లో పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు వివరించారు. ఒకే రకమైన విద్యార్హతలు, విధులు నిర్వహిస్తున్న తమ పట్ల వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉన్నత విద్యామండలి పరిధిలోని వర్సిటీలకు మాత్రమే జీవో 3 వర్తిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల పరిపాలనా నియంత్రణలో నడిచే ఈ మూడు ప్రత్యేక వర్సిటీలకు ఆ జీవో వర్తించదని వీటికి ప్రత్యేక నియామక, సేవా నిబంధనలు ఉంటాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో కోర్టులు కొత్తగా చట్టాలు చేయలేవని ఈ విషయంలో ప్రభుత్వాలదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా ఏకపక్షంగా, రాజ్యాంగంలోని అధికరణ 14కు స్పష్టమైన విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయస్థానాల జోక్యం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర జనరల్ వర్సిటీల తరహాలోనే తాము కూడా యూజీసీ వేతనాలు పొందుతున్నామనే ఏకైక కారణంతో పదవీవిరమణ వయసు పెంపును డిమాండ్ చేసే చట్టపరమైన హక్కు పిటిషనర్లకు లేదని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.కేవలం నియామకాలు, వేతన సవరణల క్రమబద్ధీకరణ నిమిత్తం మాత్రమే ఈ వర్సిటీలలో యూజీసీ పేస్కేల్‌ అమలు చేస్తున్నారని అంతమాత్రాన అన్ని నిబంధనలు ఒకేలా ఉండాలని కోరలేరని కోర్టు అభిప్రాయపడింది. ఒకే రకమైన పనిచేస్తున్నామంటూ ఇతరులతో సమానంగా రిటైర్మెంట్ వయసును పెంచాలని హక్కుగా కోరలేరని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఉన్నత విద్యామండలి పరిధిలో లేని యూనివర్సిటీలకు జీవో 3 వర్తించబోదని పశుసంవర్ధక, వ్యవసాయశాఖలు వేర్వేరుగా స్పష్టం చేస్తూ రాసిన లేఖలను సైతం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ప్రొఫెసర్లు దాఖలు చేసిన 13 పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో రాష్ట్రంలోని ఇతర శాఖల్లోనూ ఇదే తరహా డిమాండ్లతో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రాధాన్యత స్పష్టమైంది.