ఏపీలోని ఆ ప్రభుత్వ స్కూల్‌లో అడ్మిషన్లకు డిమాండ్.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో రికమండేషన్లు

Wait 5 sec.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలంటే జనాలకు చిన్నచూపు.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ మోజులో పడి ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల్ని చేర్చాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించే రోజులివి. కానీ ఏపీలోని ఆ ప్రభుత్వ స్కూల్‌‌లో అడ్మిషన్ అంత ఈజీ కాదు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో రికమండేషన్ చేయిస్తారు. ప్రతి ఏటా అడ్మిషన్ కోసం పిల్లలు, తల్లిదండ్రులు క్యూ కడతారు. అడ్మిషన్లు లేవంటూ స్కూల్ బయట బోర్డు పెడతారంటే ఈ స్కూల్‌లో అడ్మిషన్లకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ స్కూల్ ఏది అనుకుంటున్నారా.. నెల్లూరులోని వీఆర్‌సీ (వెంకటగిరి రాజా) ప్రభుత్వ ఉన్నత పాఠశాల. నెల్లూరు వీఆర్‌సీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక్కరోజులోనే అడ్మిషన్లు ఖాళీ అయ్యాయి. ఈ ఏడాది కూడా స్కూల్ బయట అడ్మిషన్లు లేవని బోర్డు పెట్టాల్సి వచ్చింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో స్కూల్ మూతపడగా.. కూటమి ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించింది. మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ప్రోత్సాహంతో స్కూల్ మళ్లీ దారిలో పడింది. ఏకంగా రూ.15 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఈ స్కూల్‌లో రోబోటిక్‌ ల్యాబ్‌లు, ఆధునిక హైస్పీడ్‌ కంప్యూటర్లు, స్పోర్ట్స్, మిగిలిన సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అందుకే ఈ స్కూల్‌లో సీట్లకు డిమాండ్‌ పెరిగింది. నెల్లూరు వీఆర్‌సీ స్కూల్‌లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు మొత్తం 1056 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు మొత్తం ఆశ్చర్యకరంగా వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ ప్రారంభమైన శుక్రవారమే భర్తీ అయ్యాయంటే డిమాండ్ ఎలా ఉందో అర్ధమవుతుంది. ఈ స్కూల్‌లో అడ్మిషన్ల కోసం కొంతమంది తల్లిదండ్రులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు కూడా తీసుకొచ్చినా సీట్లు లేవని చెప్పడంతో వారంతా నిరుత్సాహంతో వెనక్కు వెళ్లిపోయారు. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న ఈ రోజుల్లో ప్రభుత్వ స్కూల్‌లో అడ్మిషన్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు క్యూ కట్టడం గొప్ప విషయమే. నెల్లూరులో 1875లో 12 ఎకరాల్లో వీఆర్‌సీ స్కూల్ ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాతోపాటుగా పొరుగు జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. ఎంతోమంది ప్రముఖులు ఈ స్కూల్‌లోనే చదువుకున్నారు.. ఇక్కడే చదివిన మంత్రి నారాయణ స్కూల్ కోసం చొరవ తీసుకున్నారు. ఈ పాఠశాలకు రూ.15 కోట్లతో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించారు. ఈ స్కూల్‌లో అంతర్జాతీయ స్థాయి విద్యావిధానాలతో కూడిన ఉచిత విద్య అందిస్తారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం, సైకిళ్లు, భోజనం, స్నాక్స్, ఉచిత పుస్తకాలు, దుస్తులు అందిస్తారు. అందుకే ప్రతి ఏటా ఈ స్కూల్‌ బయటు అడ్మిషన్లు లేవని బోర్డు కనిపిస్తుంది.