ప్రపంచవ్యాప్తంగా నెలకున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సంఘర్షణల నేపథ్యంలో పలు దేశాలు తమ సైనిక, రక్షణ రంగాలను బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా అణాయుధ సామర్థ్యం కలిగిన దేశాలు సంపత్తిని మరింత పెంచుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్ కూడా ముందంజలో ఉందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. జనవరి 2026 నాటికి భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తన వార్షిక నివేదకలో పేర్కొంది. అంతేకాదు, పాకిస్థాన్‌ (17) కంటే భారత్‌ వద్ద ఎక్కువ అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని తెలిపింది.ప్రపంచ దేశాల వద్ద అణ్వాయుధాలపై విడుదల చేసిన నివేదికలో ఏడాది వ్యవధిలోనే భారత్‌ 10 వార్‌హెడ్లను పెంచుకుందని వివరించింది. సాపేక్షంగా ఈ వ్యత్యాసం స్వల్పంగా ఉన్నప్పటికీ దక్షిణాసియాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అణు పోటీలో భారత్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. నివేదిక ప్రకారం.. చైనా అంతర్భాగంలోని లక్ష్యాలను ఛేదించగల సుదూర క్షిపణులపై భారతదేశం ఇప్పుడు దృష్టి సారిస్తోంది. 2025లో కొత్త అణు ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. మన పొరుగు దేశం చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నట్టు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఆ దేశం కొత్తగా 20 అణు వార్‌హెడ్‌లను చేర్చుకుందని తెలిపింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరాయుధీకరణ ధోరణి తిరోగమించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రకారం. రష్యా, అమెరికాలు ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా నిలిచాయి. ఈ జాబితాలో 5,420 అణ్వాయుధాలో రష్యా, 5,042 అణు వార్‌హెడ్లతో అమెరికా వరుస రెండు స్థానాల్లో, 370 ఆయుధాలతో ఫ్రాన్స్, 225 ఆయుధాలతో యూకే, 90 ఆయుధాలతో ఇజ్రాయెల్, 60 ఆయుధాలతో ఉత్తర కొరియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని 9 అణ్వాయుధ దేశాలు ఉండగా... వాటి వద్ద మొత్తం 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లు పేర్కొంది. ఇక, ప్రపంచంలోనే రక్షణ రంగానికి అత్యధికంగా కేటాయింపులు చేస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్‌ డాలర్లుగా ఉందని నివేదిక తెలిపింది. దీనికి ముందు ఏడాదితో పోలిస్తే ఇది 8.9శాతం అధికం. ఇక, 2021-25 మధ్య ప్రపంచ రక్షణ రంగ దిగుమతుల్లో 8.2శాతం భారత్‌వే కావడం గమనార్హం. పశ్చిమ, ఉత్తర సరిహద్దులకు సంబంధించిన మరింత సంక్లిష్టమైన వ్యూహాత్మక వాతావరణాన్ని ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నమే ఈ మారుతున్న వైఖరికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గతేడాది ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న సైనిక ఘర్షణ నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవలి సంవత్సరాలలో ఈ రెండు అణు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక సంక్షోభాలలో ఇది ఒకటని సిప్రి అభివర్ణించింది. ఈ సమయంలో ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించుకున్నాయి. అణ్వాయుధాలను నిల్వచేసినట్టు భావిస్తున్న పాక్ వైమానిక క్షిపణి కేంద్రాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది.