రేవంత్ రెడ్డి ఆరెస్సెస్ మూలాలు బయటపడ్డాయి.. కేరళ మాజీ సీఎం విజయన్ ఫైర్

Wait 5 sec.

కొన్ని రోజుల క్రితం జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అప్పుడు సీఎంగా ఉన్న పినరయి విజయన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కేరళలో విజయన్ టైం అయిపోయిందని.. ఆయన గద్దె దిగే సమయం ఆసన్నం అయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిన విజయన్.. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపైనా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య కొన్ని రోజుల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పినరయి విజయన్ పార్టీ ఘోర పరాభవం చెందడంతో.. ఆయన కుర్చీ దిగిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డిపై విజయన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అయితే ఆ సంస్థకు అని పేరు పెట్టడానికి గల కారణాలను వివరించిన రేవంత్ రెడ్డి.. దానికి హిట్లర్ స్ఫూర్తి అంటూ పేర్కొన్నారు. హిట్లర్ వద్ద ఉండే సైన్యం పేరు హైడ్రా అని.. అక్రమ కట్టడాలను కూల్చేసే సంస్థకు ఆ పేరే కరెక్ట్ అని పెట్టినట్లు వివరించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంలోకి తాజాగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎంట్రీ ఇచ్చారు. హైడ్రాపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన పినరయి విజయన్.. 'రేవంత్ రెడ్డి తన హైడ్రాకు హిట్లర్ స్ఫూర్తి అని గర్వంగా ఒప్పుకోవడం దిగ్భ్రాంతికరం. ఇది ఆయన ఆర్‌ఎస్‌ఎస్ మూలాలను, ఫాసిస్ట్ మనస్తత్వాన్ని బట్టబయలు చేస్తుంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి' అని ట్వీట్ చేశారు. దీంతో ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి, పినరయి విజయన్ మధ్య చెలరేగిన రాజకీయ మాటల యుద్ధం ఇంకా చల్లారలేదు అని అర్థం అవుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి హైడ్రాను ఉద్దేశించి చేసిన హిట్లర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు సమర్థిస్తున్నారు.