విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్ -2, ఎస్‌టీసీ -3 హీట్ ఎఫ్‌జీలో ఈ ప్రమాద ఘటన జరిగింది. ద్రవ ఉక్కును లిఫ్ట్ చేస్తున్న సమయంలో లాడెల్ నుంచి ద్రవ ఉక్కు పడటంతో భారీ క్రేన్ దగ్ధమైంది. ద్రవ ఉక్కు పెద్ద మొత్తంలో లీక్ అయ్యి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయినట్లు తెలిసింది.ఈ ఘటనతో సీసీడీ విభాగంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.