కుప్పం టీడీపీ ఇంఛార్జి మార్పు.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించిన చంద్రబాబు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కుప్పం టీడీపీ నేతల సమావేశం జరిగింది. కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ చాలా రోజులుగా కోరుతున్నారు. కుప్పం నేతలతో సమావేశం సందర్భంగా ఈ విషయం చర్చకు రాగా.. కుప్పం నియోజకవర్గ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ను తప్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గం గురించి ఇకపై తానే అన్నీ చూసుకుంటానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అలాగే సేవలను రాష్ట్ర స్థాయిలో వాడుకోవాలని అధినేత నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని. త్వరలోనే కుప్పంలో పర్యటిస్తానని చంద్రబాబు నేతలకు సూచించినట్లు తెలిసింది. ఇక కంచర్ల శ్రీకాంత్ స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌కు కుప్పం నియోజకవర్గం బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి . శ్రీకాంత్ మార్గదర్శకత్వంలో నడవాలని కుప్పం నేతలకు సూచించినట్లు సమాచారం. అలాగే కంచర్ల శ్రీకాంత్‌ను చంద్రబాబు తన పీఏగా నియమించుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున బరిలోకి దిగి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. అప్పట్లో ఈ విజయం సంచలనం రేపింది. ఆ తర్వాత శాసనమండలిలో విప్‌గా కంచర్ల శ్రీకాంత్‌ను నియమించారు. కుప్పం ఇంఛార్జిగా, కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ పొలిటికల్ ఛైర్మన్‌గా కంచర్ల శ్రీకాంత్ పనిచేశారు. అయితే పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే కంచర్ల శ్రీకాంత్ సేవలను రాష్ట్రస్థాయిలో ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.