మారిన ఆర్థిక పరిస్థితుల్లో నిత్యావసరాలు, విద్య, వైద్య ఖర్చులతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య కుటుంబాలపై వంటగ్యాస్ ధరల రూపంలో మరో భారీ భారం పడింది. దేశంలోని ప్రధాన నగరాలన్నింటి కంటే అత్యంత గరిష్ట స్థాయికి చేరాయి. తాజాగా గ్యాస్ కంపెనీలు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.29 మేర ధరను పెంచాయి. ఈ తాజా పెంపుతో భాగ్యనగరంలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.994కు చేరి రూ.1000 మార్కుకు చేరువగా వచ్చింది.ఈ ధరల పెంపుతో దేశంలోనే అత్యధిక గ్యాస్ ధరలు కలిగిన నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. బిహార్ రాజధాని పాట్నా రూ.1,031.50 ధరతో మొదటి స్థానంలో ఉంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వినియోగదారులు చాలా ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు.. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.942 ఉండగా, ముంబైలో రూ.941.50, బెంగళూరులో రూ.944.50, జైపూర్‌లో రూ.945.50, చెన్నైలో రూ.957.50, కోల్‌కతాలో రూ.968గా ఉంది. దీని ప్రకారం ఢిల్లీ, ముంబై నగరాల వినియోగదారుల కంటే హైదరాబాద్ వాసులు రూ.52 అదనంగా చెల్లిస్తుండగా.. చెన్నై కంటే రూ.36.50 ఎక్కువగా భరిస్తున్నారు.గ్యాస్ వినియోగదారులకు ఈ ధరల పెంపు డబుల్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత మార్చి నెలలోనే సిలిండర్ ధరపై రూ.60 పెంచిన కంపెనీలు, ఇప్పుడు మూడు నెలలు తిరగకముందే మరో రూ.29 పెంచాయి. అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే సిలిండర్‌పై ఏకంగా రూ.89 మేర అదనపు భారం పడింది. ఒక సాధారణ కుటుంబం నెలకు ఒక సిలిండర్ చొప్పున వాడుకున్నా.. మార్చి నెలకు ముందున్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ఏడాదికి అదనంగా రూ.1,068 భారం పడుతుంది. ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు వాడే కుటుంబాల వ్యయం మరింత పెరగనుంది. నగరాల్లో వంటగ్యాస్ అనేది ప్రత్యామ్నాయం లేని అత్యవసర వస్తువు కావడంతో ధరలు పెరిగినా వాడకం తగ్గించుకోలేని నిస్సహాయ స్థితిలో సామాన్యులు ఉన్నారు.అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల ఒడిదొడుకులు, మార్కెట్ వాస్తవికతకు అనుగుణంగా దేశీయ ధరలను సర్దుబాటు చేయాల్సి రావడం వల్లే ఈ ధరల పెంపు అనివార్యమైందని ఇంధన పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇండియా తన దేశీయ అవసరాల కోసం అత్యధిక శాతం ఎల్పీజీని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో వచ్చే మార్పుల ప్రభావం నేరుగా ఇక్కడి రిటైల్ ధరలపై పడుతోందని నిపుణులు చెబుతున్నారు.