Rajesh Exports: బెంగళూరుకు చెందిన బంగారం శుద్ధి, ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో రూ.15.15 లక్షల కోట్ల మేర ఆర్థిక అక్రమాలు జరిగినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సంస్థ ఛైర్మన్ రాజేశ్ మెహతాను ట్రేడింగ్ నుంచి నిషేధించింది. ఇది కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది. కానీ, ఆ బంగారం కంపెనీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీఎల్ఐ పథకంలో నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి.రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ భారీ ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఆరోబిస్తూ గతవారం 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులను సెబీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ కోసం ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం కింద లబ్ధిదారుల జాబితా నుంచి ఆ కంపెనీని తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిర్గిజ్‌స్థాన్ అధికారిక పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడుతుందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సెబీ సరిగా గుర్తించలేకపోయింది ఆదివారం తెలిపింది. అయితే, సరైన ఫైళ్లను సెబీ గుర్తించలేకపోయిందని భావిస్తున్నామని తెలిపింది. దీన్ని పరిష్కరించేందుకు, సెబీ కోరిన పత్రాలను 15 రోజుల్లోగా తిరిగి సమర్పిస్తామని వెల్లడించింది. 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో రూ.15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచి చూపారని ఆరోపిస్తూ జూన్ 3వ తేదీన సెబీ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుకు ఒక ప్రాథమిక అకౌంటింగ్ లోపమే మూలమని కంపెనీ ఛైర్మన్ రాజేశ్ మెహతా తెలిపారు. కంపెనీ ఎబిటా గణాంకాలను తీసుకుని వాటిని ఆదాయంగా వర్గీకరించడంతోనే లోపం తలెత్తిందని పేర్కొన్నారు. ఎబిటా అంటే స్థూల ఆదాయం కిందకు వస్తుందని, దాన్ని సెబీ ఆదాయంగా వర్గీకరించిందని వివరించారు.