ఆంధ్రప్రదేశ్‌‌లో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా జిల్లాల వారీగా అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఆయా రంగాల వారీగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు పరిశ్రమలు, కంపెనీలను తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. పారిశ్రామిక ప్రగతితో నగరాలు, పట్టణాలతో పాటుగా పల్లె ప్రాంతాల రూపురేఖలు మార్చే ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుండటంతో.. జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అనకాపల్లి జిల్లా పారిశ్రామిక ప్రగతి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు బెల్లం, చెరకు, మామిడికి ప్రసిద్ధి చెందిన అనకాపల్లి జిల్లా ఇప్పుడు పరిశ్రమలను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, వారీ ఎనర్జీస్, లారస్ ల్యాబ్స్, బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్, లిథియం అయాన్‌ సెల్‌ ఫ్యాక్టరీ తదితర కంపెనీలు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్నాయి. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడంతోపాటు.. నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడటంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ, అచ్యుతాపురంలో అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. ఎస్ రాయవరం, నక్కపల్లి, యలమంచిలి, పాయకరావుపేట మండలాల్లో స్థిరాస్థి రంగం ఇటీవలి కాలంలో బాగా పుంజుకుందని చెబుతున్నారు. గతంలో అనకాపల్లి జిల్లాలో ఎకరం భూమి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉండేదని.. ఇప్పుడు ఎకరా రూ.కోటి వరకు పలుకుతోందని టాక్ వినిపిస్తోంది. విశాఖపట్నం తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనకాపల్లి జిల్లావైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వ్యాపారులు అనకాపల్లి జిల్లాలో స్థలాల కొనుగోలుపై ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో స్థలాలకు గిరాకీ పెరిగిందంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల భూములకు డిమాండ్ పెరగడంతో ఇటీవల కాలంలో ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరిగాయి. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి నుంచి భోగాపురం వరకు సెమీ రింగ్ రోడ్డు కూడా సిద్ధమవుతోంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే గంటన్నరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లొచ్చు. సెమీ రింగ్ రోడ్డు రాకతో అనకాపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందడం ఖాయమంటున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన, త్వరలోనే రాబోతున్న పరిశ్రమలకు ఎయిర్‌పోర్టు అనుసంధానం వరంగా మారనుంది. అంతే కాకుండా తుని, పాయకరావుపేట సమీపంలో ఎయిర్ స్ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. అనకాపల్లి - పాయకరావు పేట జాతీయ రహదారి వెంట చిన్న చిన్న వ్యాపారాలు మొదలయ్యాయి. విశాఖపట్నంతో అనకాపల్లి జిల్లాకు రోడ్డు అనుసంధానం కూడా పెరగడం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. అనకాపల్లి, నక్కపల్లి, పరవాడ, పాయకరావుపేట ప్రాంతాలు పెట్టుబడికి అనుకూలమని కొందరు స్థిరాస్థి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే ఇక్కడ స్థలాల రేట్లు మరింత పెరుగుతాయని.. అనకాపల్లి మెగా స్టీల్ సిటీగా మారబోతుందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని పరిశ్రమలు రాబోతున్నాయని.. భవిష్యత్తులో నక్కపల్లి మండలం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతుందని భావిస్తున్నారు. ఒకప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలు ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లేవారు.. పరిశ్రమల ఏర్పాటుతో అనకాపల్లి జిల్లాలోనే భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడంతోపాటు.. విశాఖ డివిజన్ పరిధిలోకి వెళ్లిన అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి రైల్వే స్టేషన్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నుంచి చెరుకు, మామిడి పంట ఎగుమతి అవుతున్నాయి. అలాగే యలమంచిలి, పాయకరావుపేటలో మామిడి తాండ్ర కుటీర పరిశ్రమతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సమీపంలోనే మంచినీటి సరస్సు ఉండటంతో పర్యావరణ పరంగానూ అభివృద్ధి జరుగుతోంది. పరవాడ, అచ్యుతాపురంలో పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. అనకాపల్లి విశాఖపట్నానికి దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది.. గంటలోపే విశాఖపట్నం నుంచి అనకాపల్లి చేరుకోవచ్చు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం, అనకాపల్లి జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనకాపల్లిలోని కొన్ని ప్రాంతాలు విశాఖపట్నంలో కలిసిపోయాయి. రాబోయే రోజుల్లో పరిశ్రమలతో పాటుగా ఐటీ కంపెనీలను అనకాపల్లి వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ కారణాలతో అనకాపల్లి జిల్లాలో రియల్ బూమ్‌‌ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో చాలామంది ముందు చూపుతో అక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.