తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి, రవాణా రంగానికి ఊతమిచ్చేలా రామగుండం–మనుగూరు నూతన రైల్వే కారిడార్ త్వరలోనే పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రధాన ఆర్థిక హబ్‌గా ఎదిగేందుకు అన్ని అర్హతలున్న ఈ ప్రతిపాదిత రైల్వే లైన్.. సుమారు 200 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రూ.5 వేల కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా అటు సరుకు రవాణా, ఇటు ప్రయాణికుల కనెక్టివిటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ నూతన రైల్వే లైన్ ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఏటా దాదాపు రూ.460 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా. ఆపరేషన్ ప్రారంభించిన ఐదేళ్ల వ్యవధిలో.. బొగ్గు, కోక్, ఆహార ధాన్యాలు, సిమెంట్, ఖనిజాలు, ఇతర లోహాల రవాణా ద్వారా ఏటా దాదాపు 12 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతుందని దీని ద్వారా వార్షిక రాబడి ఏకంగా రూ.720 కోట్లకు చేరుతుందని రైల్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.సరుకు రవాణాతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఢిల్లీ–చెన్నై హై-డెన్సిటీ రూట్‌లో రామగుండం వ్యూహాత్మకంగా ఉండటం ఈ ప్రాంత ఆర్థిక పురోగతికి మరింత ప్లస్ పాయింట్ కానుంది. ఈ ప్రతిపాదిత లైన్ ద్వారా రామగుండం, భద్రాచలం ప్రాంతాల్లోని సింగరేణి బొగ్గు గనుల బెల్టుల మధ్య ప్రత్యక్ష రైలు మార్గం ఏర్పడనుంది. ప్రస్తుతం కొత్తగూడెం నుండి రామగుండానికి బొగ్గు రవాణా చేయాలంటే అత్యంత రద్దీగా ఉండే డోర్నకల్–వరంగల్–రామగుండం సెక్షన్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఇది న్యూఢిల్లీ-చెన్నై హై-డెన్సిటీ కారిడార్‌లో భాగం కావడం వల్ల తీవ్ర ఆలస్యమవుతోంది.ప్రస్తుతం ఉన్న ఈ పాత రూట్ కంటే కొత్తగా ప్రతిపాదించిన 207 కిలోమీటర్ల రామగుండం–మనుగూరు బొగ్గు కారిడార్ ఏకంగా 150 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. ఈ షార్ట్ రూట్ వల్ల రవాణా సమయం కలిసిరావడమే కాకుండా నిర్వహణ సామర్థ్యం పెరిగి లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే పూర్తయి కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం వేచి ఉంది. భూసేకరణకు పట్టే ఒక ఏడాదితో కలిపి, మొత్తం ఐదేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి న్యూఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లు భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ప్రయాణించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మార్చడమే కాకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.