విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హాట్ మెటల్ కార్మికులపై పడటంతో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది. స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం స్టీల్‌ మెల్ట్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)-1లో ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఎంఎస్‌-1లో లాడిల్‌ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది.. ఏకంగా 1,540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న దాదాపు 150 టన్నుల హాట్ మెటల్ ఒక్కసారిగా మీద పడటంతో కార్మికులు సజీవదహనం అయ్యారు. స్టీల్‌ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఇది తీవ్ర దురదృష్టకరమైన ఘటన.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి' అని ట్వీట్ చేశారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా) అందిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు దుర్మరణం పాలయ్యారని తెలిసి కలిచివేసిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు ఆరా తీశారు. స్టీల్ ప్లాంట్ లో చేపట్టిన సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని దిశా నిర్దేశం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖపట్నం చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు..స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విశాఖపట్నం వచ్చారు. ఆయన సోమవారం అర్ధరాత్రి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర హోం మంత్రి అనిత, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు వెంట ఉన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి ఎస్‌ఎంఎస్‌-1 దగ్గర పరిస్థితిని పరిశీలించి సమీక్షించారు.. ఈ ప్రమాదం గురించి ఆరా తీశారు.. అనంతరం అధికారులతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అర్హత కలిగిన పదవీవిరమణ ప్రయోజనాలకు అదనంగా రూ.25 లక్షలు పరిహారం ఇస్తామని తెలిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం, చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామన్నారు. అంతేకాదు చనిపోయిన వ్యక్తి కుటుంబం.. ఆయన పదవీ విరమణ తేదీ వరకు స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్స్‌లో ఉండేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఒకవేళ స్టీల్‌ ప్లాంట్‌ క్వార్టర్స్‌లో కాకుండా బయట నివాసం ఉండేవారు కోరుకుంటే అర్హత ప్రకారం క్వార్టర్లు కేటాయిస్తామని ప్రకటించారు. మృతుల పిల్లల విద్యను ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఉద్యోగుల పిల్లలతో సమానంగా కొనసాగిస్తామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదం తర్వాత జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు 089125 90100, 089125 90102కు కాల్‌ చేయొచ్చని తెలిపారు.