హైదరాబాద్‌లోని క్యూర్ పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇక ఆ ఇళ్లు నిర్మించిన స్థలాల్లో వారి వాటాకు ఓనర్‌ను చేస్తూ పేదింటి ఆడబిడ్డలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. నగర పరిధిలో నివసించే పేదల జీవనోపాధికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా.. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు దగ్గర్లోనే అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు లక్ష ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇవాళ సచివాలయంలోని తన ఆఫీస్‌లో మంత్రి పొంగులేటి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లకు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో 2.50 లక్షలు కలిపి.. మొత్తం 3.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గత బీఆర్ఎస్ సర్కార్ నగరంలోని పేదల జీవన పరిస్థితులను, వారి ఉపాధి అవసరాలను పట్టించుకోకుండా హైదరాబాద్‌కు దూరంగా 30-40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించినట్లు మంత్రి పొంగులేటి విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూం ఇళ్లు ఖాళీగా, నిరుపయోగంగా ఉండిపోయాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అలాంటివి జరగకుండా ఉండేందుకు.. ప్రస్తుతం పేదలు ఉంటున్న ప్రాంతాల్లోనే వారు గౌరవప్రదంగా జీవితాన్ని గడిపేలా.. ఖరీదైన ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక పేదలకు సౌకర్యవంతంగా ఉండేలా ఇందిరమ్మ ఇళ్ల డిజైన్లను తయారు చేయాలని.. ఇంటి నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ భూములను ఉపయోగిస్తూ లక్ష ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. పేద మహిళలకు సొంతింటిపై హక్కు కల్పించి.. వారి ఆర్థిక, సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.