డమాన్ దీవుల్లో భారీగా సహజ నిక్షేపాలు బయటపడ్డాయి. అండమాన్ తూర్పు తీరానికి 15 కి.మీ. దూరంలోని శ్రీ విజయపురం-3 వద్ద గ్యాస్ నిల్వలు కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించింది. లిమిటెడ్ తవ్వకాల్లో సముద్రం అడుగున 355 మీటర్ల లోతులో నిల్వలను గుర్తించారని, భారత సముద్రతీర అన్వేషణ ప్రయత్నాల్లో కీలకమైన పురోగతి అని తెలిపింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్‌ (ట్విట్టర్)లో ఈ మేరకు అన్వేషణకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ‘‘సముద్ర గర్భంలో 355 మీటర్ల లోతులో నిక్షేపాలను గుర్తించారు.. ఇయోసీన్ పొరలో 1,900 మీటర్లకుపైగా లోతులో నిర్వహించిన ప్రాథమిక ఉత్పత్తి పరీక్షల్లో గ్యాస్ ఉనికి బయటపడింది.. ప్రస్తుతం ఈ గ్యాస్ నాణ్యత, దాని కెలోరిఫిక్ విలువ అంచనా వేయడానికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ముమ్మరంగా శాంప్లింగ్ పనులు జరుగుతాయి’’ అని మంత్రి తెలిపారు. ఆయిల్ ఇండియా ప్రకారం.. అండమాన్ బేసిన్‌లో ప్రస్తుత అన్వేషణలో భాగంగా తవ్విన మూడు బావులలోని రెండింటిలో హైడ్రోకార్బన్ ఉనికి ఉంది. ‘‘గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశీయ ఇంధన నిల్వలను పూర్తిస్థాయి వినియోగానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సముద్ర మంథన్ మిషన్ కింద మన హైడ్రోకార్బన్ నిల్వలను పూర్తిగా వినియోగించుకోవడానికి తీరప్రాంత బేసిన్‌లలో పెద్ద సంఖ్యలో అన్వేషణ చేపట్టాలనే ప్రణాళిక రచించాం.. అండమాన్ బేసిన్‌లో మూడు అన్వేషణా బావులలో రెండు బావులలో హైడ్రోకార్బన్ ఉనికి ఇప్పుడు నమోదైంది’’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఆవిష్కరణ అండమాన్ బేసిన్‌లో కొనసాగుతున్న అన్వేషణలకు దక్కిన అతిపెద్ద విజయమని, ఇది దేశ ఇంధన సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి హర్షం వ్యక్తం చేశారు. అండమాన్‌ దీవుల సముద్ర జలాలు సహా మహానది, సౌరాష్ట్ర, బెంగాల్‌ బేసిన్స్‌లో ఆయిల్‌, సహజ వాయువు నిక్షేపాల కోసం అన్వేషణ చేపట్టారు. ఈ ప్రాంతాల్లో అన్వేషణ కోసం రూ.3,200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం అనుమతిచ్చింది.