ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ రూపురేఖలు త్వరలోనే మారిపోనున్నాయి. ముంబయి తరహాలో వైజాగ్‌ను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా చేసిన ఆలోచనే.. బేసిటీ. విశాఖపట్నంలోని తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో పర్యటించిన చంద్రబాబు.. విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బేసిటీగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అలాగే గ్రేహౌండ్స్‌కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని చంద్రబాబు ఆదేశించారు.కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. బీచ్ వాటర్ స్పోర్ట్స్, వైజాగ్ జంతు ప్రదర్శన శాలను ఆధునీకరించటంతో పాటుగా ఎర్రమట్టి దిబ్బలు, బౌద్దక్షేత్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ చర్యల ద్వారా విశాఖకు మరింత మంది పర్యాటకులను ఆకర్షించవచ్చని సూచించారు. మరోవైపు కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ బేసిటీగా డెవలప్ చేసేందుకు ముంబయిలో సక్సెస్ అయిన సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ తరహా విధానాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు విశాఖ గ్రోత్ హబ్ కింద.. బేసిటీని అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ ఇటీవల సూచించింది. విశాఖపట్నం 2.0ను భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు విస్తరించాలని, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం చుట్టూ ఏరోసిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని కూడా నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. డెవలపింగ్ విశాఖ ఎకనమిక్ రీజియన్ యాజ్ గ్లోబల్ ఎకనమిక్ హబ్ అనే పేరుతో నివేదిక విడుదల చేసిన నీతి ఆయోగ్..శ్రీకాకుళం నుంచి అంబేద్కర్ కోనసీమ వరకు 9 జిల్లాలను కవర్ చేసేలా ఎకనమిక్ రీజియన్ ప్రతిపాదించింది. నీతి ఆయోగ్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం ముంబయిని సందర్శించింది. అక్కడి విధానాలను పరిశీలించింది.