ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌, చింతకాయల విజయ్‌లు నామినేషన్‌ దాఖలు చేశారు. అమరావతిలోని అసెంబ్లీలో ఉన్న రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లతోపాటుగా వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పుల వివరాలకు సంబంధించి అఫిడవిట్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ముగ్గురు టీడీపీ అభ్యర్థుల్లో భాష్యం రామకృష్ణ కోటీశ్వరులు.. ఆయన తన అఫిడవిట్‌లో తన పేరిట, తన భార్య లక్ష్మీప్రసన్న, కుమారుడు సాకేత్‌ రామ్, కుమార్తె జనని కృష్ణ పేరిట ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. రామకృష్ణ కుటుంబానికి రూ.169.97 కోట్ల చరాస్తులు ఉన్నాయి. కుటుంబానికి సంబంధించిన వాహనాల విలువ రూ.18.37 కోట్లుగా పేర్కొన్నారు.. వీటిలో ఆయన కుమారుడు పేరిటే రూ.18.14 కోట్ల విలువైనవి ఉన్నట్లు తెలిపారు. రామకృష్ణ పేరుతో రూ.2,20,76,000 విలువైన ఆభరణాలు ఉన్నాయి.. వీటిలో 1,420 గ్రాముల బంగారం, 25 క్యారెట్ల వజ్రాలు, 5,120 గ్రాముల వెండి ఉంది. రామకృష్ణ కుటుంబం మొత్తం స్థిరాస్తులు రూ.502.64 కోట్లు కాగా.. ఆయన పేరుతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, కమర్షియల్ బిల్డింగ్స్, నివాస భవనాలు కలిపి విలువ రూ.454.95 కోట్లు ఉంది. రామకృష్ణ పేరుతో మొత్తం అప్పులు రూ.200.65 కోట్లు ఉంటే.. ఆయన పేరుతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.132.43 కోట్లు. రామకృష్ణపై హైదరాబాద్‌లో ఒక కేసు పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. భాష్యం రామకృష్ణ మొత్తం ఆస్తులు రూ.672.61 కోట్లు. మరో అభ్యర్థి సానా సతీష్‌బాబు, ఆయన భార్య నాగజ్యోతిల ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. మొత్తం చరాస్తులు రూ.27.80 కోట్లు కాగా.. సతీష్‌కు రూ.45 లక్షల విలువైన కారు, రూ.42 లక్షల విలువైన మరో కారు, ఆయన భార్యకు రూ.77లక్షల విలువైన కారు ఉంది. అలాగే రూ.34లక్షల విలువైన మరో కారు ఉంది. సతీష్‌ పేరుపై రూ.2.61 కోట్ల విలువైన 1,825 గ్రాముల బంగారం, భార్యకు రూ.2.01 కోట్ల విలువైన 1,410 గ్రాముల బంగారం ఉంది. కాకినాడలో సతీష్‌ భార్య పేరుతో రూ.4.11 కోట్ల విలువైన ఎకరం భూమి ఉన్నట్లు తెలిపారు. సతీష్ తన కుటుంబానికి సొంతిల్లు కూడా లేదని తెలిపారు. సతీష్‌ పేరుతో రూ.1.95 కోట్లు, ఆయన భార్యకు రూ.26.39 లక్షల అప్పులు ఉన్నాయి. సానా సతీష్‌పై ఢిల్లీలో 2017లో సీబీఐ, 2019లో ఈడీ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో సీబీఐ నమోదు చేసిన కేసులో తాను నిందితుడిగా లేనని, తనకు వ్యతిరేకంగా ఛార్జిషీట్‌ కూడా వేయలేదన్నారు. సీబీఐ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని తాను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈడీ కేసులో తనను ముందు సాక్షిగా పిలిచి, ఆ తర్వాత నిందితుడుగా పేరు చేర్చారన్నారు. చింతకాయల విజయ్, ఆయన భార్య డాక్టర్‌ సువర్ణ కుమారి, వారి ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్‌లో వెల్లడించారు. విజయ్ కుటుంబానికి మొత్తం రూ.7.06 కోట్లు చరాస్తులు ఉన్నాయి. బంగారం 1,940గ్రాములు, వెండి 38.5కిలోలు ఉంది. విజయ్ కుమార్తె పేరుతో సుకన్య సమృద్ధి యోజన కింద రూ.5.14లక్షలు ఉన్నాయి. విజయ్‌ కుటుంబ స్థిరాస్తి మొత్తం రూ. 31.58 కోట్లు కాగా.. విజయ్‌ పేరుతో రూ.7.44 కోట్లు ఆయన భార్య పేరిట రూ.24.14 కోట్లు ఉన్నాయి. విజయ్ కుటుంబ మొత్తం అప్పులు రూ.16.91 కోట్లు ఉంటే.. విజయ్‌ భార్య పేరిట రూ.13.94 కోట్లు అప్పు ఉంది. తనపై ఆరు క్రిమినల్ కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపారు. విజయ్‌ కుటుంబం మొత్తం ఆస్తి రూ.38 కోట్లు.