‘రాత్రంతా పనిచేసైనా సరే.. ఆ విద్యార్థి ఫలితాలు ఇవ్వాల్సిందే’: సీబీఎస్‌ఈపై సుప్రీంకోర్టు ఫైర్

Wait 5 sec.

: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు వ్యవహార శైలిపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక విద్యార్థి విద్యా సంవత్సరం, భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడు అధికారులు ఎలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారంటూ మండిపడింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా పరీక్షలు రద్దయి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఒక విదేశీ విద్యార్థి పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సెలవుల బెంచ్.. సీబీఎస్‌ఈ బోర్డుకు, దాని ప్రాంతీయ అధికారికి అత్యవసర నోటీసులు జారీ చేసింది. "ఇది ఒక చిన్నారి కెరీర్‌కు సంబంధించిన అంశం. ఆలస్యమైతే ఉన్నత చదువుల అడ్మిషన్లు కోల్పోతారు. అవసరమైతే రాత్రంతా నిద్రపోకుండా పనిచేసైనా సరే.. ఆ విద్యార్థి ఫలితాలను వెంటనే ప్రకటించండి" అని న్యాయస్థానం స్పష్టమైన డెడ్‌లైన్ విధించింది.యుద్ధం తెచ్చిన తిప్పలు.. సౌదీ అరేబియాకు చెందిన ప్రాన్షు జిగర్‌కుమార్ పటేల్ అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా జస్టిస్ మన్మోహన్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ఈ సంచలన ఆదేశాలు ఇచ్చింది. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ మేఘాల కారణంగా పలు గల్ఫ్ దేశాలలో సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థుల కోసం బోర్డు ఒక ప్రత్యేక అసెస్‌మెంట్ విధానాన్ని రూపొందించింది. విద్యార్థి స్కూల్లో రాసిన ఇంటర్నల్ అసెస్‌మెంట్లు, ప్రాజెక్ట్ వర్క్స్, ప్రాక్టికల్ పరీక్షలు, ప్రీ బోర్డు పరీక్షల మార్కులను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని వీరికి మార్కులు వేస్తారు. ఒకవేళ కొన్ని సబ్జెక్టుల పరీక్షలు జరిగి, మరికొన్ని రద్దయితే.. రాసిన పరీక్షల్లో వచ్చిన అత్యుత్తమ మార్కుల సగటును రద్దయిన సబ్జెక్టులకు వర్తింపజేస్తారు.దీని ఆధారంగానే మే 13న దేశవ్యాప్తంగా క్లాస్ 12 ఫలితాలను బోర్డు విడుదల చేసింది. అయితే పటేల్ ఫలితాన్ని మాత్రం ప్రకటించకుండా.. మార్కుల జాబితాలో ‘ఆర్.ఎల్’ (రిజల్ట్ లేటర్ - ఫలితం తర్వాత వెల్లడిస్తాం) అని చూపించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించకపోవడంతో సదరు విద్యార్థి సుప్రీంకోర్టు తలుపు తట్టాడు.రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన..ఫలితాల ప్రకనను నిలిపివేయడం ఏకపక్షమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లను ఉల్లంఘించడమేనని పిటిషనర్ తరపు న్యాయవాదులు వినీత్ జిందాల్, రాజ్ కిశోర్ చౌదరి కోర్టుకు వివరించారు. గల్ఫ్ దేశాలలో పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థుల కోసం తెచ్చిన ప్రత్యేక మూల్యాంకన ప్రయోజనాలను తమ క్లయింట్‌కు కూడా వర్తింపజేయాలని కోరారు. అంతేకాకుండా ఈ సమస్య కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే పరిమితం కాలేదని, వివిధ దక్షిణాసియా దేశాలలో ఉన్న వందలాది మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఇదే సమస్యతో అల్లాడిపోతున్నారని న్యాయవాది జిందాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ప్రైవేట్ అభ్యర్థులను కూడా ఈ స్పెషల్ స్కీమ్‌లోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూన్ 12వ తేదీ శుక్రవారం రోజుకు వాయిదా వేసింది.