రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదురుగా వచ్చి ఏం కావాలని ఎవరినైనా అడిగితే రియాక్షన్ ఎలా ఉంటుంది. కష్టాలు చెప్పుకుని సాయం చేయమని కచ్చితంగా అడుగుతారు. కానీ పశ్చిమగోదావరి జిల్లాకు సోషల్ మీడియాలో వైరల్ అయిన పెద్దాయన సానబోయిన సత్యనారాయణ మాత్రం అలా కాదు.. తనతో పాటుగా తన సొంత ఊరి సమస్యల్ని కూడా సీఎంకు చెప్పారు.. వెంటనే పరిష్కారం అయ్యేలా భరోసాను పొందారు. ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంకకు చెందిన సత్యనారాయణ.. మీ భూమి-మీ హక్కు కార్యక్రమం కోసం సిద్ధాంతం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తన కల నిజమైందని ఆనంద వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యనారాయణను తన బస్సులోకి పిలిపించుకుని ఆప్యాయంగా 10 నిమిషాలకుపైగా మాట్లాడారు. సీఎం 'మీకు ఏమైనా కావాలా' అని సత్యనారాయణను అడిగారు. తమ ఊరిలో డ్రైనేజీ సరిగా లేదని, రోడ్డు వేయాలని కోరారు. ఊరికోసం కచ్చితంగా చేద్దామని చెప్పిన చంద్రబాబు.. 'మీకు వ్యక్తిగతంగా ఏం కావాలి..? అని అడిగారు. తన పెద్ద కుమారుడు ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయన్ని కాపాడాలని కోరారు. 'మీ కోసం ఏమీ వద్దా' అని చంద్రబాబు అడిగితే.. తాను ఉంటున్న పాకకు, చెరువకు చిన్న రోడ్డు కావాలని కోరారు. ఇల్లు కట్టుకోమని చంద్రబాబు అడిగితే తన దగ్గర డబ్బులు లేవని చెప్పారు సత్యనారాయణ. వెంటనే కలెక్టర్‌ నాగరాణిని పిలిచి ఆయనకు ఇల్లు నాలుగు నెలల్లోనే కట్టించాలని సూచించారు. సత్యనారాయణ పనులన్నీ చేయాలని చెప్పారు. చంద్రబాబును కలలో కూడా ఇలా కలుస్తానని అనుకోలేదన్నారు సత్యనారాయణ. తన సమస్యతో పాటు ఊరు సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం ఆనందంగా ఉందని సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు.సత్యనారాయణతో పాటుగా ఓ యువకుడ్ని ముఖ్యమంత్రి బస్సులోకి పంపించారు. చంద్రబాబు లోపలికి రాగానే సత్యనారాయణ సంబరపడ్డారు. తన వయసు 96 సంవత్సరాలని, ఇప్పటికి సైకిల్ తొక్కుతానని చెప్పారు. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా లేవన్నారు. తనకు ఐదురుగు సంతానమని చెప్పారు. మొత్తం మీద పెద్దాయన సత్యనారాయన కల నెరవేరింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంకకు చెందిన సత్యనారాయణ వీడియోలు ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు సత్యనారాయణ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. చంద్రబాబు సిద్ధాంతం వస్తున్నారని సత్యనారాయణకు ఆ యువకుడు చెప్పారు. సీఎంను చూడటానికి వెళదామని సత్యనారాయణ యువకుడితో చెప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సిద్ధాంతంలో కలుద్దామని హామీ ఇచ్చారు.. చెప్పినట్లుగానే సత్యనారాయణను చంద్రబాబు కలిశారు.