మహిళా సంఘాలకు మరో 400 కొత్త బస్సులు.. ఏటా రూ.244.08 కోట్ల ఆదాయం

Wait 5 sec.

తెలంగాణలోని వ్యాపారవేత్తలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం విజయవంతంగా ముందుకు సాగుతోంది. మహిళల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా కొనుగోలు చేసిన రెండో విడత 400 సరికొత్త ఆర్టీసీ అద్దె బస్సులను మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో 2025 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇదే వేదిక నుంచి సీఎం తొలి విడతగా 153 బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి విడత ఊహించని రీతిలో విజయవంతం కావడంతో ప్రభుత్వం రెండో విడత కింద మరిన్ని బస్సుల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది.ఈ పథకం కింద నడిచే బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను టీజీఎస్‌ఆర్టీసీనే సమకూరుస్తుంది. డ్రైవర్, కండక్టర్ జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులు పోను ఒక్కో బస్సుకు ఆర్టీసీ యాజమాన్యం నెలకు రూ.69,468 అద్దె రూపంలో మహిళా సంఘాలకు నేరుగా చెల్లిస్తోంది. మొదటి విడతలో ప్రారంభించిన 153 బస్సుల ద్వారా మహిళా సంఘాలకు నెలకు రూ.1,06,28,604 చొప్పున.. ఏడాది కాలంలో ఏకంగా రూ.12,75,43,248 ఆదాయం లభించింది. ఈ ఆర్థిక లాభాలు, గ్రామీణ రవాణాలో వచ్చిన సానుకూల మార్పులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. రెండో విడతలో మరో 400 బస్సుల కొనుగోలుకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి బస్సుల మొత్తం సంఖ్య 553కు చేరుకుంది.రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఈ పథకానికి పూర్తి పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తోంది. మహిళా సంఘాల ద్వారా బ్యాంకు రుణాల సహాయంతో ఈ బస్సులను సెర్ప్ కొనుగోలు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఈ 553 బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తం వాహనాల కోసం మహిళా సంఘాలు రూ.199.08 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టాయి. దీనికి ప్రతిఫలంగా వారికి ప్రతి నెల రూ.20.34 కోట్ల చొప్పున.. ఏడాదికి మొత్తంగా రూ.244.08 కోట్ల అద్దె ఆదాయం స్థిరంగా సమకూరనుంది. ఇది గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ పథకంలో భాగంగా ఆర్టీసీకి బస్సులను అద్దెకిచ్చిన జిల్లాల జాబితాలో నల్గొండ జిల్లా 32 బస్సులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీని తర్వాత నిజామాబాద్ జిల్లా 28 బస్సుల కొనుగోలుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అత్యల్పంగా పట్టణ వాతావరణం ఎక్కువగా ఉండే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలు కేవలం 5 బస్సులను మాత్రమే కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చాయి. ఈ బస్సుల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్రంలోని మండల కేంద్రాలు, సుదూర గ్రామాలకు ఆర్టీసీ రవాణా సేవలు భారీగా విస్తరించనున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 640 మండలాల్లో 560 గ్రామీణ మండలాలు కాగా.. కేవలం 7 మండల సమాఖ్యలు మినహా దాదాపు అన్ని మండల సమాఖ్యలకు ఈ పథకం కింద బస్సులు సమకూరడం విశేషం.