ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న టెస్టులో అప్ఘనిస్థాన్ జట్టు 152 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఫాలో ఆన్ తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత డెబ్యూ స్పిన్నర్ ఆరు వికెట్లు తీసుకుని అప్ఘనిస్థాన్ బ్యాటింగ్ విభాగాన్ని మొత్తం కుప్పకూల్చాడు. దాంతో మూడో రోజు లంచ్ బ్రేక్ ముందే అప్ఘనిస్థాన్ ఆలౌట్ అయింది. 113/5 వికెట్లతో మూడో రోజు ఆట మొదలు పెట్టిన అప్ఘనిస్థాన్ జట్టుకు రహ్మత్ షా కాసేపు అండగా నిలిచాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలోనూ పరుగులు రాబట్టాడు. మూడో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే హాఫ్ సెంచరీ చేసుకున్న రహ్మత్ షా 60 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో అప్ఘనిస్థాన్ పోరాటం ముగిసింది. రహ్మత్ అవుటైన కాసేపటికే అప్ఘనిస్థాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో మానవ్ సుతార్ ఆరు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీసుకోగా, వాషింగ్టన్ సుందర్‌ ఒక వికెట్ తీసుకున్నాడు. అప్ఘనిస్థాన్ 152కే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 412 పరుగుల ఆధిక్యం లభించింది. తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన అప్ఘనిస్థాన్ లంచ్ బ్రేక్ ముందే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే సాగిన మొదటి సెషన్ రెండో ఇన్నింగ్స్‌లో అప్ఘనిస్థాన్ జట్టు వికెట్ కోల్పోకుండా 18 పరుగులు చేసింది. సెడికుల్లా అటల్ 12 బంతుల్లో 16 పరుగులు చేయగా, అబ్దుల్ మాలిక్ 12 బంతుల్లో 2 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. కేఎల్ రాహుల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీలు నమోదు చేశారు. సాయి సుదర్శన్, రిషభ్ పంత్ ఇద్దరూ 81 పరుగుల వద్దే అవుటయ్యారు. వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అప్ఘనిస్థాన్ జట్టులో రహ్మత్ షా మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా రాణించలేకపోయాడు. బ్యాటింగ్‌కి అనుకూలించే ముల్లాన్‌పూర్ పిచ్‌పై బ్యాటర్లు రాణించడం విశేషం.