: మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు వెలుగుచూడటంతో మే 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దానిని రద్దు చేసి.. పునఃపరీక్ష ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మరో రెండు వారాల్లో అంటే జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను అత్యంత పకడ్బందీగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఎన్టీఏ సర్వసన్నద్ధమవుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ప్రశ్నాపత్రాలను రూపొందించే అధికారులను లౌక్‌డౌన్‌లో పెట్టింది. ఫోన్లు ఇవ్వకుండా, బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా చూస్కుంటుంది. ఆపూర్తి వివరాలు మీకోసం. రహస్య ప్రాంతంలో నిపుణుల బృందం బంధీ..ప్రశ్నా పత్రాల రూపకల్పన దశలోనే గరిష్ట భద్రతను నిర్ధారించడానికి ఎన్టీఏ అసాధారణమైన చర్యలు చేపట్టింది. నీట్ రీ టెస్ట్ క్వశ్చన్ పేపర్‌ను తయారు చేస్తున్న సబ్జెక్ట్ నిపుణులు, పర్యవేక్షకులు, అనువాదకులు సహా ఈ ప్రక్రియతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరినీ ఒక రహస్య, అత్యంత సురక్షితమైన ప్రాంతంలో 'లాక్‌డౌన్' చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. బయటి ప్రపంచంతో వీరికి ఎలాంటి సంబంధాలు లేకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలాంటి కమ్యూనికేషన్ పరికరాలను ఆ ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. భద్రతా సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో ఉండే ఈ నిపుణులు.. అక్కడే పూర్తి ఐసోలేషన్‌లో గడపాల్సి ఉంటుంది.ప్రశ్నాపత్రాల రవాణాకు వాయుసేన విమానాలు..!గతంలో ఎన్టీఏపై వచ్చిన విమర్శల నేపథ్యంలో.. ఈసారి పరీక్ష నిర్వహణ కోసం దించారు. ప్రశ్నపత్రం తయారీ మొదలుకొని ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్, రవాణా, పరీక్షా కేంద్రాలకు పంపిణీ చేసే వరకు ప్రతీ దశలోనూ కఠినమైన నిఘా నీడన పనులు సాగుతున్నాయి. అత్యంత సున్నితమైన ఈ ప్రశ్నపత్రాల రవాణా కోసం భారత వాయుసేన (ఐఏఎఫ్) విమానాలను వినియోగించనుండటం ఈ ఏర్పాట్ల తీవ్రతకు అద్దం పడుతోంది.దుష్ప్రచారాన్ని ఖండించిన ఎన్టీఏ..మరోవైపు రాబోయే రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలను ఎన్టీఏ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ మోసపూరితమైన, అవాస్తవ ప్రచారాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు, తల్లిదండ్రులు ఇలాంటి వదంతులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు భరోసా ఇచ్చారు.