పాకిస్తాన్ జట్టులో ఎప్పుడూ ఏదోక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. కెప్టెన్లు, కోచ్ మార్పులో చాలా ఫాస్ట్‌గా ఉండే పీసీబీ ఇప్పుడు పాకిస్తాన్ టెస్టు టీమ్‌పై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 0 - 2తో ఘోర ఓటమిపాలయింది. మంచి మంచి ప్లేయర్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా డ్రా చేయలేకపోయింది. దాంతో జట్టులో కీలక మార్పులు చేసే ఆలోచనలో పీసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, కెప్టెన్ షాన్ మసూద్‌‌పై వేటు వేసే ఆలోచనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్లు సమాచారం. పీసీబీ వర్గాల ప్రకారం.. మాజీ ప్లేయర్లు యూనిస్ ఖాన్, మొహమ్మద్ హఫీజ్‌తో బోర్డు కీలక పదవులపై చర్చలు జరుపుతోంది. బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత పాకిస్థాన్ టెస్టు వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సలహాదారులు సూచించినట్లు సమాచారం. వాళ్ల ప్రకారం టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించి, మళ్లీ అండర్ 19, ఏ జట్ల బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలో పీసీబీ ఉంది. అయితే యూనిస్ ఖాన్‌తో ఒప్పందం కుదిరిన తర్వాతే సర్ఫరాజ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సర్ఫరాజ్‌తో పాటు పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను కూడా మార్చాలని పీసీబీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల్లో మరో అవకాశం ఇవ్వాలని మసూద్ బోర్డును కోరినట్లు తెలుస్తోంది. అయితే, మొహమ్మద్ హషీజ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమించడంతో పాటు ఐసీసీ విభాగానికి కూడా బాధ్యతలు అప్పగించే అంశాన్ని పీసీబీ పరిశీలిస్తోంది. కొంతకాలంగా హఫీజ్ క్రికెట్ డిబేట్లలో బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హఫీజ్‌కు పదవి ఇవ్వడం విమర్శలను ఆపేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని మరికొందరు అంటున్నారు. మొత్తానికి బంగ్లాదేశ్ సిరీస్ పరాజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.