: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలు.. పండగలు, పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాల సమయంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. గతేడాది రేట్లు భారీగా పెరగ్గా డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది మాత్రం గరిష్ఠ స్థాయిల నుంచి పడుతూ వస్తున్నాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధమే బంగారం ధరలు తగ్గేందుకు కారణం. ఈ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో.. పసిడిపై పెట్టుబడులు తగ్గి డిమాండ్ తగ్గుతోంది. దీంతో రేట్లు కూడా దిగొస్తున్నాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇటీవల యుద్ధం ముగుస్తుందన్న అంచనాల నడుమ.. అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందానికి చేరువైన క్రమంలో క్రూడాయిల్ ధరలు తగ్గి బంగారం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ గత 10 రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై క్లారిటీ లేదు. ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఇరాన్- ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకున్నాయి. Crude Oil Prices:ఈ దాడుల నేపథ్యంలో క్రూడాయిల్ ధర మళ్లీ 4 శాతం వరకు పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్ల చేరువలోకి వెళ్లింది. సాధారణంగానే క్రూడాయిల్ ధరలు పెరుగుతుంటే అటు వైపు డిమాండ్ పెరిగి బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వస్తున్న అంచనాలు కూడా బంగారం ధరలు తగ్గేందుకు కారణం అవుతోంది. US Fed Rate Hikes:ఇటీవల అమెరికన్ కంపెనీలు మే నెలలో అంచనాలకు మించి ఉద్యోగాలు కల్పించడంతో.. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఈసారి పెంచుతుందన్న అంచనాలు పెరిగాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు డిమాండ్ పెరిగి.. బంగారం ఆకర్షణ కోల్పోతుంటుంది. ఈ క్రమంలోనే మళ్లీ బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్లు చూస్తే 22 క్యారెట్లపై ఇవాళ జూన్ 8న ఉదయం 10 గంటల సమయంలో రూ. 950 తగ్గడంతో తులం రూ. 1,39,050 కి చేరింది. దీనికి ముందు జూన్ 4, 5, 6 తేదీల్లో చూస్తే వరుసగా రూ. 100, రూ. 350, రూ. 2750 చొప్పున తగ్గిన సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1040 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 1,51,,690 వద్ద ఉంది. బంగారం ధర తగ్గినా సిల్వర్ రేటు ప్రస్తుతం కేజీకి రూ. 2.70 లక్షల వద్ద స్థిరంగానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ రేట్లు..ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, దిగొస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4320 డాలర్ల దిగువకు చేరింది. సిల్వర్ రేటు చూస్తే ప్రస్తుతం 68 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకొని ప్రస్తుతం రూ. 95.30 వద్ద ట్రేడవుతోంది.