పేద ప్రజల కార్పొరేట్ ఆసుపత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ ఆదివారం (జూన్ 7) బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఆయన్ను మూడేళ్ల కాలపరిమితికి నిమ్స్ డైరెక్టర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిమ్స్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ.. వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో నిమ్స్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. నిమ్స్‌కు వచ్చే రోగులకు అత్యంత నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలను సకాలంలో అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ దేవరాజ్ నాయకత్వంలో నిమ్స్ సంస్థ మరిన్ని ఉన్నత విజయాలు సాధిస్తుందని పూర్వ డైరెక్టర్ నగరి బీరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.అపార అనుభవం.. అద్భుత రికార్డులుగాంధీ మెడికల్ కాలేజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 1992 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్, వైద్య రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన 1998లో ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తి చేయగా.. 2002లో యూరాలజీ విభాగంలో ఎం.సీహెచ్ పట్టా పొందారు. నిమ్స్ యూరాలజీ విభాగంలో గత పదేళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలు అందిస్తున్న ఆయన.. ప్రస్తుతం నిమ్స్ యూరాలజీ, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు.నిమ్స్‌ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి, రోబోటిక్ శస్త్రచికిత్స విధానాల విజయవంతమైన అమలులో డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ పాత్ర అనన్యసామాన్యం. నిమ్స్‌లో ఇప్పటివరకు రెండు వేలకు పైగా కిడ్నీ మార్పిడి చికిత్సలు నిర్వహించడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలోనే 500 మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను, 550 రోబోటిక్ వైద్య ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించారు. వైద్య బోధన రంగంలో కూడా ఆయనకు 21 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. వైద్య రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఉత్తమ జూనియర్ ఫ్యాకల్టీ అవార్డును, 2022లో ఉత్తమ సీనియర్ ఫ్యాకల్టీ అవార్డును అందించి సత్కరించింది. అటు వైద్యుడిగా, ఇటు బోధకుడిగా, పరిశోధకుడిగా అపార అనుభవం ఉన్న డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నిమ్స్ డైరెక్టర్‌గా రావడం పట్ల ఆసుపత్రి వర్గాలు, రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.