టీమిండియాలోకి అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూయించాడు. అప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఆధిపత్యం సాధించింది. శనివారం మొదలైన ఈ టెస్టులో తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో రోజు ఆఖరి సెషన్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసి అప్ఘనిస్థాన్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా డెబ్యూ బౌలర్ అప్ఘనిస్థాన్ బ్యాటర్లను తికమకపెట్టాడు. బంతి అందుకున్న వెంటనే తొలి వికెట్ పడగొట్టిన మానవ్ సుతార్.. అప్ఘనిస్థాన్‌‌పై డామినేట్ చేస్తూనే ఉన్నాడు. రెండో రోజు మూడు వికెట్లు పడగొట్టిన మానవ్ సుతార్.. మూడో రోజు కూడా అదే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 21 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చిన మానవ్ సుతార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఐదో వికెట్ కోసం తహతహలాడుతూ బౌలింగ్ చేసిన మానవ్‌కి తన 22వ ఓవర్‌లో ఆ ఛాన్స్ దక్కింది. క్రీజులో నిలదొక్కుకుని హాఫ్ సెంచరీ చేసిన రహ్మత్ షాని లెగ్ వికెట్ మీదుగా ఓ అద్భుతమైన బంతిని వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. రహ్మత్ షా వికెట్‌తో ఐదు వికెట్లు తీసుకున్న మానవ్ సుతార్ రికార్డు సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అదే ఓవర్‌లో రహ్మత్‌ షాను అవుట్ చేసిన తర్వాత మరో వికెట్ కూడా తీసుకున్నాడు. మొహమ్మద్ సలీమ్ సఫీ వికెట్లకు ఎదురుగా వచ్చిన బంతిని అడ్డుకోబోయి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. భారత జట్టు అప్పీల్ చేయడంతో అంపైర్ అవుటిచ్చాడు. రెండు డీఆర్ఎస్‌లు ఉన్నప్పటికీ అప్ఘనిస్థాన్ రివ్యూ కోరకుండానే పెవిలియన్‌కు వెళ్లింది. దాంతో మానవ్ సుతార్ ఆరో వికెట్ దక్కించుకున్నాడు. కానీ.. రివ్యూ బంతి అవుట్ సైడ్ పిచ్ అని రావడంతో అప్ఘన్ పశ్చాత్తాప పడింది. తొలి మ్యాచ్‌లో మానవ్ సుతార్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లో 41 బంతులు ఆడిన మానవ్ సుతార్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుటయ్యాడు. బౌలింగ్‌లో తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా 22 ఓవర్లు బౌలింగ్ చేసిన మానవ్ సుతార్ 10 ఓవర్లు మెయిడిన్ చేసి 33 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. టీమిండియా రానున్న తన పెద్ద సిరీస్‌లలో ఓ మంచి స్పిన్నర్ కోసం చూస్తుంది అని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన క్రమంలో, మానవ్ సుతార్ ప్రదర్శనతో టీమిండియా చోటు ఫిక్సయిందనే చెప్పొచ్చు.