వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రం మొత్తం వణికేలా చేసింది. మృత్యువు చేతిలో చిక్కిన ఎనిమిది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్‌లోని ఎస్ఎంఎస్ 1లోని సీసీడీ విభాగంలో లాడిల్ పేలి లిక్విడ్ ఐరన్ కారడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తిని మృత్యువు పిలిచినట్టే వారం రోజుల సెలవు తర్వాత స్టీల్ ప్లాంట్‌లోకి వచ్చిన ఘటన గుండె తరుక్కుపోయేలా చేస్తోంది. అగనంపూడి దరి శనివాడకు చెందిన భాను కుమార్ 2018 నుంచి స్టీల్ ప్లాంట్‌లోనే ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట వివాహం కాగా.. మూడు నెలల కిందట ఒక బాబు పుట్టాడు. దాంతో వారం రోజుల పాటు పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు. వారం రోజుల సెలవు కావడంతో ఆదివారం వరకూ ఇంట్లోనే ఉన్న భానుకుమార్ సోమవారం పూట డ్యూటీ ఎక్కాడు. మధ్యాహ్నం బీ షిఫ్ట్‌లో జాయిన్ అయిన భాను.. రెండున్నర గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. సాధారణంగా భానుకుమార్ సీ షిఫ్ట్‌కు రావాల్సి ఉండగా.. తన సహచర ఉద్యోగి బీ షిఫ్ట్‌కు రావాలని కోరడంతో వచ్చి ప్రాణాలు కోల్పోయాడని.. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గోల్డ్ కుమార్ (మేనేజర్), భాను కుమార్ టెక్నీషినయన్, జీవీ అప్పారావు, కృష్ణ నాగు, ప్రభాకర రావు, త్రినాథ్, అప్పలరాజు, రమణ ప్రాణాలు కోల్పోయారు. జి. సూరిబాబు (55), కే. పైడిరాజు (57), పి. శ్రీనివాసరావు (51), ఆర్. మల్లికార్జునరావు (41), జి. అర్జున అప్పారావు (58), బి. సత్యానంద్ (38) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సెవెన్ హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిని కేజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.