ఐదో క్లాస్ లోపు రూ.19 వేలు.. తమిళనాడులో ప్రైవేట్ స్కూల్ ఫీజుల జాబితా వైరల్.. ఇందులో నిజమెంత?

Wait 5 sec.

: తమిళనాడులోని ప్రైవేట్ పాఠశాలలు తమ ట్యూషన్ ఫీజు వివరాలను జూన్ 5వ తేదీ లోపు నోటీస్ బోర్డులపై, అధికారిక వెబ్‌సైట్లలో బహిరంగంగా ప్రదర్శించాలంటూ విద్యాశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మధ్యతరగతి, పేద విద్యార్థులకు మేలు చేస్తూ ప్రభుత్వం ఫీజులను అదుపులోకి తెచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎల్‌కేజీ నుంచి 12వ తరగతి వరకు ఒక నిర్దిష్ట ఫీజు పట్టిక వైరల్‌గా మారింది. వీటి ప్రకారం ఐదో తరగతి లోపు రూ.19 వేల ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఉంది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఒకే రకమైన ఫీజుల విధానాన్ని అమలు చేయబోతోందనే ప్రచారంలో అస్సలు నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఫీజుల పట్టిక ఇదే..!ఎల్‌కేజీ, యూకేజీలకు రూ.16,640, ఒకటి నుంచి 5వ తరగతి వరకు రూ.18,635, 6 నుంచి 8వ తరగతి వరకు రూ.20,635, 9, 10వ తరగతులకు రూ.22,965 ఫీజును తమిళనాడు సర్కారు ఖరారు చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే 11, 12వ తరగతులకు గాను రూ.25,825 ఫీజు మాత్రమే వసూలు చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇవే ఫీజులు రాష్ట్రంలోని ఏన్ని ప్రైవేటు బడులు, కాలేజీల్లో ఉంటుందని చెబుతున్నారు. కానీ దీంట్లో ఎంత మాత్రమూ నిజం లేదని నిపుణులు వివరిస్తున్నారు. ఒక్కో బడికి ఒక్కో ఫీజు..!నిజానికి తమిళనాడు స్కూల్ ఫీజు నిర్ధారణ కమిటీ పని తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కలిపి ఒకే జనరల్ ఫీజును ప్రకటించదు. దానికి బదులుగా తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల చట్టం ప్రకారం.. ప్రతి విద్యా సంస్థను విడివిడిగా పరిశీలిస్తుంది. ఆయా పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు, వారు పెట్టే పెట్టుబడి, ఉపాధ్యాయుల జీత భత్యాల ఖర్చులు, స్కూల్ ఉన్న భౌగోళిక ప్రాంతం, రోజువారీ నిర్వహణ వ్యయాలను కమిటీ క్షుణ్ణంగా అంచనా వేస్తుంది. వీటి ఆధారంగానే ప్రతి పాఠశాలకూ ఫీజు నిర్మాణాన్ని కమిటీ ఖరారు చేస్తుంది.ఈ వ్యవహారంలో కమిటీ ప్రధానంగా మూడు సూత్రాల ఆధారంగా పని చేస్తుంది. ప్రతీ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాల తమ సొంత ఆర్థిక రికార్డులను, తాము వసూలు చేయాలనుకుంటున్న ప్రతిపాదిత ఫీజుల వివరాలను కమిటీకి సమర్పించడం తప్పనిసరి. ఆ రికార్డులను తనిఖీ చేసిన తర్వాతే కమిటీ ఒక నిర్దిష్ట ఫీజు కాలక్రమాన్ని ఆమోదిస్తుంది. ఇది వరుసగా మూడు విద్యా సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. అలాగే 2026–27 విద్యా సంవత్సరానికి గానూ కమిటీ ఆమోదించిన వివరాలను పరిశీలిస్తే.. ఒకే తరగతికి స్కూళ్లను బట్టి ఫీజుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని చిన్న గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైమరీ స్కూళ్లకు వార్షిక ఫీజు రూ. 10,000 లోపే ఉండగా.. అదే క్లాసు చదివేందుకు నగరాల్లోని ప్రముఖ మెట్రిక్యులేషన్ స్కూళ్లలో ఫీజు రూ. 60,000 దాటింది. సర్కారు ఏ బడికి ఎంత ఫీజు పెట్టిందో ఇలా తెలుసుకోవచ్చు..!ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫీజులు.. ఉదాహరణకు ఎల్‌కేజీకి రూ. 16,640, ఇంటర్‌కు రూ. 25,825 ఏదైనా ఒక నిర్దిష్ట పాఠశాలకు కమిటీ కేటాయించినవి మాత్రమే అయి ఉండవచ్చని.. అంతే తప్ప అది రాష్ట్రవ్యాప్త నిబంధన కాదని నిపుణులు తేల్చారు. మరోవైపు కమిటీ ద్వారా ఏ స్కూల్‌కు ఏ ఫీజు అయితే ఆమోదించబడిందో.. ఆ నిర్దిష్ట వివరాలను మాత్రమే సదరు పాఠశాల యాజమాన్యం తమ నోటీస్ బోర్డులపై, వెబ్‌సైట్లలో ఉంచాలని ప్రైవేట్ పాఠశాలల డైరెక్టరేట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఒక పాఠశాల నోటీస్ బోర్డుపై ఉన్న ఫీజులు కేవలం ఆ సంస్థకు మాత్రమే వర్తిస్తాయి. అదే వీధిలో ఉన్న మరో స్కూల్‌కు కమిటీ పూర్తిగా భిన్నమైన ఫీజులను ఆమోదించి ఉండవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే నిర్దిష్ట విద్యాసంస్థకు ప్రభుత్వం ఆమోదించిన అసలు ఫీజు ఎంతో తెలుసుకోవడానికి జిల్లా వారీగా ఉన్న వివరాలను ఫీజు కమిటీ అధికారిక వెబ్‌సైట్ (tnfeecommittee.com) ద్వారా నేరుగా సరిచూసుకోవచ్చని అధికారులు సూచించారు.