గోల్డ్ స్కీమ్స్‌లో పెట్టుబడులపై ఆంక్షలు.. టాటా, HDFC, ICICI ఫండ్స్ కీలక నిర్ణయం.. కారణం ఇదే!

Wait 5 sec.

: పసిడి పథకాల్లో భారీ పెట్టుబడులపై దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (AMC) తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక్కడ ఒకవైపు ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ.. భారతీయుల్ని బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలని చెప్పడం ఒక కారణం కాగా.. దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల్లో ఉండటం మరో కారణంగా తెలుస్తోంది. ఇక్కడ నగదు నిర్వహణ సహా పసిడి కొనుగోళ్లలో ఎదురవుతున్న సవాళ్లు, పసిడి ధరల్లో ఒడుదొడుకులు కూడా కారణంగానే ఉన్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సహా యాక్సిస్, టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏకమొత్తంలో పెట్టుబడుల్ని తాత్కాలికంగా నియంత్రిస్తున్నట్లు స్పష్టం చేశాయి. అంటే సబ్‌స్క్రిప్షన్‌పై పరిమితులు విధిస్తున్నాయన్నమాట. వీటి బాటలోనే కోటక్ మహీంద్రా AMC, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC కూడా ఆంక్షలు విధిస్తాయని భావిస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి (Gold ETFs) నేరుగా వచ్చే పెట్టుబడులు రూ. 25 కోట్లు దాటితే తీసుకోవట్లేదు. ఇదే సమయంలో గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లలోకి (FoF) వచ్చే పెట్టుబడులపైనా పరిమితుల్ని విధించాయి. ఇక్కడ ఒక పాన్ కార్డుపై క్యాలెండర్ మంత్‌లో గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకే పెట్టుబడులకు అనుమతిస్తున్నాయి. అసలు ఇలా ఆంక్షలు పెట్టేందుకు కారణాలు ఏంటో చూద్దాం. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్ నిబంధనల ప్రకారం.. గోల్డ్ ఫండ్లు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌ ద్వారా సేకరించిన ప్రతి రూపాయికీ సమాన విలువ కలిగిన బంగారాన్ని (99.5 స్వచ్ఛతతో) మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొనుగోలు చేసి.. తమ కస్టడీలో భద్రపరచాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి ఇదే సమయంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని మోదీ పిలుపు..భారత్ బంగారం విషయంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుందన్న సంగతి తెలిసిందే. అంటే ఇక్కడ పసిడి దిగుమతి చేసుకునేందుకు డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. అప్పుడు విదేశీ మారకం తరిగిపోతోంది. ఈ క్రమంలో విదేశీ మారకాన్ని ఆదా చేసుకునేందుకు.. పసిడి కొనుగోళ్లను భారత ప్రజలు దాదాపు ఏడాది పాటు నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పిలుపునిచ్చారు. దిగుమతి సుంకాల్ని పెంచడంతో పాటుగా కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఈ నేపథ్యంలోనే గోల్డ్ ఫండ్లలోకి వందల కోట్లు పెట్టుబడుల రూపంలో వస్తున్నా.. అందుకు సరిపడినంత బంగారం బయట కొనేందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉండట్లేదు. ఈ సంస్థలు భారీగా బంగారం కొనుగోలు చేస్తే.. మార్కెట్లో బంగారం ధరలు కృత్రిమంగా పెరిగే అవకాశం కూడా ఉండటంతో ఫండ్ మేనేజర్లు అప్రమత్తమవుతున్నారు. లిక్విడిటీ సమస్యలు లేకుండా..మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎక్కువగా లిక్విడిటీని నమ్ముకొని పనిచేస్తాయి. అంటే అవసరమైనప్పుడు నగదుగా మార్చుకుంటాయి. అందుకే ఇప్పుడు భారీగా పెట్టుబడులు వచ్చి.. తర్వాత మార్కెట్ అస్థిరతతో ఒకేసారి ఉపసంహరణలు ఎదురైతే.. ఫండ్ సంస్థలు ఇబ్బందుల్లో పడతాయి. అందుకే ఇలా లిక్విడిటీ నిర్వహణలో భాగంగానే ఏఎంసీలు తాత్కాలిక ఆంక్షల్ని అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది.