ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రీ ప్రయాణం తర్వాత కారణాలు ఏమైనా బస్సుల్లో మాత్రం విపరీతమైన రద్దీ పెరిగింది. సీట్లు సంగతి దేవుడెరుగు కనీసం నిల్చునే ఖాళీ కూడా లేకుండా పోయింది. అయితే, ఈ రద్దీని కొందరు అదునుగా చేసుకుని చేతివాటం చూయించడం మొదలుపెడుతున్నారు. ముఖ్యంగా లేడీ గ్యాంగ్స్ బస్సుల్లో తిరుగుతూ అందినకాడికి బంగారం దోచుకుంటోంది. మహిళా ప్రయాణికులే టార్గెట్‌గా తిరుమల, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు ఎక్కువయ్యాయని.. అలెర్ట్‌గా ఉండాలంటూ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికులుగా బస్సుల్లో ఎక్కి కొందరు లేడీ దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ లేడీ బ్యాచ్‌ని పాకాల పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలు కలిసి ఓ గ్యాంగ్‌గా ఏర్పడి బస్సుల్లో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేస్తున్నారు. తోటి ప్రయాణికులు మాదిరే నమ్మించి, వాళ్లకి తెలియకుండానే చోరీలకు ప్రాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ లేడీ బ్యాచ్ నుంచి రూ. 3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు, హ్యాండ్ బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలు కాజేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంపై నిఘా పెట్టి శంఖంపల్లి ఫ్లై ఓవర్ వద్ద ఈ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో జి.దివ్య (31), బి.రాధిక (38), బి.మేరి (33) అరెస్టు చేశామని.. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఇంకెన్ని దొంగతనాలు చేశారు అనేది కూడా రిమాండ్‌లో తేలనుంది. ఇకపై రద్దీ బస్సుల్లో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.