కమర్షియల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు . బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లతో అపజయం ఎరుగని డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్‌కు కొత్త అర్థం చెప్పిన వ్యక్తి అనిల్. సినిమాని తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయడమే కాదు, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతుంటారు. ప్రమోషన్స్ అంటే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు మాత్రమే కాదని తెలియజెప్పారు. ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ విషయంలోనూ అనిల్ తన మార్క్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. వచ్చే పండగ నాటికి తన తదుపరి చిత్రాన్ని రెడీ చేస్తానని ప్రకటించారు. ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోలుగా ఓ సినిమాని అనౌన్స్ చేశారు. #VenkyAnil5 #NKRxAR అనే వర్కింగ్ టైటిల్స్ తో పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలే స్క్రిప్ట్ కూడా లాక్ చేశారు. తాజాగా ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చారు. 'వెంకీ - కళ్యాణ్ రామ్' సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు. అయితే అందరిలా ఏదో ఒక పోస్టర్ వదిలి చేతులు దులుపుకోకుండా.. ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ వీడియోతో వచ్చారు. జీవీ ప్రకాష్, లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ లతో కలిసి అనిల్ చేసిన ఈ వీడియో అలరిస్తోంది.ఇందులో ''హైదరాబాదు.. ఆదిలాబాదు.. సికిందరాబాదు.. అహమ్మదాబాదు..'' అంటూ జంధ్యాల తెరకెక్కించిన ‘వివాహ భోజనంబు’ మూవీలో సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్‌లో జరిగే ఓ సన్నివేశాన్ని అనిల్ రావిపూడి రీక్రియేట్‌ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ను సముద్రపు ఒడ్డున పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి, అనిల్‌ తన సినిమాకి ఎలాంటి పాటలు కావాలో చెబుతూ నవ్వులు పంచారు. ''కనీసం చేతులైనా బయటకు తీయండి మహాప్రభో'' అని రిక్వెస్ట్ చేసిన జీవీ ప్రకాష్.. తనకు ఒక లిరిక్‌ రైటర్‌ ని ఇస్తే బాగుంటుందని అడుగుతాడు. ‘ఎప్పుడో రెడీ.. అతన్ని పాతిపెట్టి రెండు రోజులైంది’ అంటూ అనంత్‌ శ్రీరామ్‌ను అనిల్ చూపించడం నవ్వులు పూయిస్తోంది. మామూలుగా ఎవరైనా సినిమా మొదలయ్యాక ప్రమోషన్స్‌ స్టార్ట్ చేస్తారు. కానీ, ఇంకా సినిమా షూటింగ్ మొదలు పెట్టకుండానే అనిల్‌ రావిపూడి VenkyAnil5 మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు. అంతేకాదు జీవీ ప్రకాష్ ను కూడా ఇందులో భాగం చేశారు. ''ప్రేక్షకులతో మమేకమయ్యేలా సంగీతాన్ని రూపొందించడంలో జీవీ ప్రకాష్‌ ప్రతిభను నేను ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటాను. #VenkyAnil5 - #NKRAnil2 ప్రాజెక్ట్ కోసం ఆయన్ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫన్నీ కాన్సెప్ట్‌ను రూపొందించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలోచనను నమ్మి, పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగమై, దీన్ని ఎంతో సరదాగా మలిచినందుకు జీవికి ప్రత్యేక ధన్యవాదాలు. బ్రదర్, మనం కలిసి మరిన్ని అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవాలని ఆశిస్తున్నాను'' అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.