ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రం.. అనేక చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు ఆలవాలం. ఎన్నో పురాతన ఆలయాలకు పుట్టినిల్లు. అలాంటి ఆలయమే తిరుపతి జిల్లాలోని . అత్యంత పురాతనమైన శివాలయాల్లో ఒకటిగా పేరొందిన ఈ గుడికి త్వరలోనే మంచిరోజులు రానున్నాయి. ఆలయ అభివృద్ధి కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ తనయుడు సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు. అనంత్ అంబానీ శుక్రవారం రోజున శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. అనంత్ అంబానీకి ఆలయ బృందంతో కలిసి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాహుకేతు పూజలు, అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం అభివృద్ధిపై, అంతర్జాతీయ కథనాల్లో ఆలయ ప్రగతి గురించి వచ్చిన వార్తలపై బొజ్జల సుధీర్ రెడ్డి.. అనంత్ అంబానీతో చర్చించారు. అలాగే వేల ఏళ్ల చరిత్ర గల గుడిమల్లం పరశురామేశ్వర ఆలయ విశిష్టతను అనంత్ అంబానీకి వివరించారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేసిన అనంత్ అంబానీ.. రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల నాటికి శ్రీకాళహస్తి, గుడిమల్లం ఆలయాల అభివృద్ధి పనులకు తన వంతుగా నిధులు, సహకారాన్ని అందిస్తానని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు. ఆలయాల అభివృద్ధికి సహకరిస్తామని అనంత్ అంబానీ మాట ఇవ్వటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్న సుధీర్ రెడ్డి.. నియోజకవర్గ ఆధ్యాత్మిక ప్రగతికి తోడుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు తిరుపతికి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలంలో ఉంటుందీ గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం. ఇక్కడున్న శివలింగాన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగంగా భావిస్తారు. క్రీ. పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.పూ.2వ శతాబ్దం నాటిదిగా చెప్తుంటారు. అలాగే ఇక్కడి లింగాన్ని త్రిమూర్తుల కలయికగా భావిస్తారు. అలాగే పురుషాంగం ఆకారంలో శివలింగం ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. అత్యంత పురాతనమైన ఈ శివాలయం అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని అనంత్ అంబానీ మాట ఇవ్వటంతో.. త్వరలోనే ఈ ఆలయానికి మంచిరోజులు వచ్చినట్లేనని భావిస్తున్నారు.