హైదరాబాద్‌కు అతి దగ్గర్లో వాటర్‌ఫాల్స్.. కేవలం 20 కి.మీ.. 30 నిమిషాల ట్రెక్కింగ్‌..!

Wait 5 sec.

నైరుతి రుతుపవనాల ఆగమనంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పూర్తిగా వర్షాకాలం వచ్చిన తర్వాత.. ప్రకృతి మొత్తం పచ్చగా మారిపోనుంది. ఈ క్రమంలోనే నదులు, వాగులు, వంకలు వర్షపు నీటితో ఉప్పొంగనున్నాయి. ఈ క్రమంలోనే కొండ ప్రాంతాల్లో ఆకాశం నుంచి గంగ దిగి వచ్చినట్లు.. జలపాతాలు జాలు వారనున్నాయి. అయితే హైదరాబాద్ వాసులు.. మనకు దగ్గర్లో ఉన్న జలపాతాలకు వెళ్లాలంటే.. ఏ ఆదిలాబాదో, మహారాష్ట్రకో, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకో వెళ్తారు. కానీ సెలవులు లేక.. అంత దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు అతి సమీపంలోనే ఉన్న వాటర్ ఫాల్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగరవాసులు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు.. సిటీకి దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాల కోసం వెతుకుతున్నారు. రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అంతరగంగ జలపాతం.. వర్షాకాలంలో ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తోంది. హైదరాబాద్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అంతరగంగ సహజ సిద్ధంగా జాలువారే ఒక జలపాతం. అక్కడికి చేరుకోవాలంటే సుమారు 30 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. వర్షాలు పడిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. సిటీకి దగ్గర్లోనే ప్రశాంతమైన ప్రకృతి అనుభూతిని కలిగిస్తుంది. కవాడిపల్లి సమీపంలోని రాతి కొండల వెనుక భాగంలో ఉన్న ఈ జలపాతం ఎల్‌బీనగర్‌ నుంచి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న సహజ జలపాతంగా ఇది గుర్తింపు పొందింది. అయితే ఈ అంతరగంగ వాటర్‌ఫాల్స్ సాధారణ పర్యాటక కేంద్రంలా కాకుండా.. అక్కడ భద్రతా కంచెలు, వ్యూ పాయింట్‌లు, పార్కులు లేవు. పూర్తిగా సహజసిద్ధమైన ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే కాస్త శ్రమించాల్సి ఉంటుంది. కొండ కింద వాహనాలను పెట్టి.. సుమారు 30 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. 30 నిమిషాల ట్రెక్కింగ్ పూర్తి అయిన తర్వాత ఎత్తైన రాతిబండలపై నుంచి కిందికి జాలువారే జలపాతం.. కింద ఏర్పడే స్వచ్ఛమైన నీటి కుంటలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. సిటీ బిజీ ట్రాఫిక్ నుంచి దూరంగా ప్రకృతి మధ్యలో ప్రశాంత వాతావరణం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.అంతరగంగ వాటర్‌ఫాల్స్‌కు ఎలా చేరుకోవాలి?హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పై నుంచి ప్రయాణించేవారు ఎగ్జిట్-11 (సుల్తాన్‌పూర్/విజయవాడ మార్గం) వద్ద కిందికి దిగి.. అబ్దుల్లాపూర్‌మెట్, కవాడిపల్లి గ్రామం గుండా సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ కొండల అడుగు భాగానికి చేరుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య అంతరగంగ జలపాతాన్ని సందర్శించడం ఉత్తమం. మరీముఖ్యంగా వర్షం పడిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత వెళ్తే జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది.