హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభకు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం.. తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ప్రాంతీయ విబేధాలు రెచ్చగొడుతున్నారంటూ.. అటు జనసేన, ఇటు తెలంగాణ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో స్పందించారు. పవన్ కళ్యాణ్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఎవరైనా రాజకీయాలు చేయవచ్చని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై క్లారిటీ ఇఛ్చిన రేవంత్ రెడ్డి.. కేవలం శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే పోలీసులు ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తేల్చి చెప్పారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని.. ఆయనకు నచ్చినట్లు రాజకీయాలు చేసుకోవచ్చని.. ఇక్కడ ఎవరైనా పోటీ చేయడానికి అర్హులేననని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన, సభ సందర్భంగా.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సభ పెట్టేందుకు పవన్ కళ్యాణ్‌కు అర్హత లేదంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన పవన్ కళ్యాణ్‌ను ఈ గడ్డపై తిరగనివ్వమంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు జనసేన నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో అని స్వయంగా పవన్ కళ్యాణ్‌.. తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తేల్చి చెప్పారు. తాను తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు.. మీరంతా ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు, టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సహా చాలా మంది నేతలు.. పవన్ కళ్యాణ్‌ తీరును తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.