మూకాంబికకు అపురూపమైన కానుక ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్

Wait 5 sec.

కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలోని పురాతన మూకాంబిక అమ్మవారిని తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ శుక్రవారం దర్శించుకున్నారు. చెన్నై నుంచి విమానంలో మంగళూరుకు చేరుకున్న విజయ్.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కొల్లూరులోని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. దీంతో తమిళనాడు సీఎం విజయ్‌కు ఆలయ అర్చకులు, అధికారులు ఎదురెళ్లి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో లోనికి ప్రవేశించిన ఆయన.. తన ఒంటిపై చొక్కాను తీసి, కండువా కప్పుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి పూజలు చేసి తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కిలోన్నరకుపై బరువున్న వెండి ఖడ్గం, పట్టు వస్త్రాలు మూకాంబిక అమ్మవారికి కానుకగా సమర్పించారు. దర్శనం అనంతరం విజయ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో విజయ్ దాదాపు అర గంట పాటు గడిపారు. కాగా, గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న ఎంజీ రామచంద్రన్.. సువర్ణ ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు.అమ్మవారి దర్శనం అనంతరం సీఎం విజయ్ స్వయంగా కారు నడుపుకుంటూ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి.. అక్కడ నుంచి మంగళూరు విమానాశ్రయానికి బయలుదేరారు. విజయ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆయన కాన్వాయ్ వెళ్తుంటే రహదారికి ఇరువైపులా నిలబడ్డారు. వారిని చూసి విజయ్ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు.