బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన తిరుగుబాటు పార్టీ ఎంపీలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారు ప్రజా తీర్పునకు ద్రోహం చేశారని ఆరోపించిన ఆమె.. రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలవాలని ఆమె సవాలు విసిరారు. మీరంతా టీఎంసీ గుర్తుపై గెలిచారని, బీజేపీ లేదా ఎన్డీయే నుంచి కాదని తెలిపారు. చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలోని సుమారు 20 మంది టీఎంసీ లోక్‌సభ రెబల్ ఎంపీల బృందం ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం టీఎంసీలో పెద్ద చీలికకు దారితీయడమే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.‘‘ మీరంతా 2024లో టీఎంసీ నుంచి గెలిచారు.. ప్రజా తీర్పు ఎన్డీఏకు అనుకూలంగా రాలేదు. పసుపు రంగు ప్యాంటు వేసుకున్న దురాశపరులు, స్వార్థపరులు, దేశద్రోహులందరూ దయచేసి బీజేపీలో చేరి మీ సీట్లకు రాజీనామా చేసి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేయండి. మీరేం గొప్ప హీరోలో చూద్దాం’’ అని ఛాలెంజ్ చేశారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్ ఎంపీ యూసఫ్ పఠాన్‌పై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊహాగానాల మధ్య ఆయన ఢిల్లీ పర్యటనపై వచ్చిన నివేదికలను ప్రశ్నించారు.‘‘ నీకెంత అమిత్ షా పిలుపుతో ఢిల్లీకి వచ్చావా?.. భారత తరఫున ఆడిన నిన్ను మా జిల్లా ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించారు.. నీకు సిగ్గుగా అనిపించడం లేదా?’’ అని మొయిత్రా మండిపడ్డారు. పార్టీకి రాజీనామా చేసిన కకోలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలోని టీఎంసీ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసిన తర్వాత.. ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారనే నివేదికలతో రచ్చ మొదలైంది. రెబల్ ఎంపీలు వేరుగా సమావేశం కావడంతో విభేదాలు గట్టిగానే ఉన్నాయనే స్పష్టమవుతోంది. పోస్ట్‌పై సోషల్ మీడియాలో కొందరు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఆధారాలు ఏవని అడుగుతున్నారు.కాగా, మమతా బెనర్జీ పోటీచేయడం కోసం ఎంపీ పదవికి యూసఫ్ పఠాన్ రాజీనామా చేయాలని సౌరవ్ గంగూలీతో రాయబారం పంపినట్టు వచ్చిన వార్తలను అటు దాదా.. ఇటు పఠాన్ ఖండించారు. అధినేత్రి మమతా బెనర్జీతో సహా ఎవరూ తనను రాజీనామా చేయమని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియాలో జరిగిన ప్రచారంపై యూసఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బరంహపూర్ నుంచి టీఎంసీ తరఫున పోటీచేసిన యూసఫ్ పఠాన్.. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరిని ఓడించారు.