హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్.. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలకు చెక్

Wait 5 sec.

విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు ఆగకుండా ఉండేందుకు.. భారీ ఫ్లైఓవర్లను, అండర్‌పాస్‌లు, స్కైవేల నిర్మాణం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్‌ ప్రాంతంలో ఉదయం, సాయంత్రం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. ఐటీ ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారు. వీటికి తోడు ఆయా జంక్షన్ల వద్ద సిగ్నళ్లు పడడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు. ఇందులో భాగంగానే బాచుపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్ నేటి నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌ను కలిపే బాచుపల్లి చౌరస్తాలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఎ) ఆధ్వర్యంలో రూ.65.53 కోట్లతో నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ను.. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో గత 4 ఏళ్లుగా సాగుతూ వస్తున్న ఈ భారీ ఫ్లైఓవర్ తాజాగా అందుబాటులోకి రావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ కావడంతో బాచుపల్లి జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. ఈ బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభించడంతోపాటు.. పరిధిలో రూ.1674.74 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని రూ.161 కోట్లతో నిర్మించనుండగా.. రూ.530 కోట్లతో మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేశారు. శేరిలింగంపల్లి ఆర్వోబీ రూ.308 కోట్లతో నిర్మించనుండగా.. ఆ పనులకు శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు కోసం రూ.229 కోట్లతో మెయిన్ బ్రిడ్జి నిర్మాణం.. ఓఆర్ఆర్ నుంచి కొత్త సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. రూ.110 కోట్లతో శంకర్ పల్లి రోడ్ ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల తర్వాత మియాపూర్‌లో నిర్వహించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్.. వంటి మెట్రో నగరాలే నడిపిస్తున్నాయని తెలిపారు. కాలుష్యంతో ఢిల్లీ.. వర్షాకాలంలో వరదలతో ముంబై.. ట్రాఫిక్ కష్టాలతో బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని.. అదే సమయంలో హైదరాబాద్ మహా నగరం మాత్రం శరవేగంగా విస్తరిస్తోందని వివరించారు. ఒక పద్ధతి ప్రకారం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకే 3 కార్పొరేషన్లుగా విభజించినట్లు తెలిపారు.వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3 కార్పొరేషన్లు చేశామని.. పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం కోసం సరిహద్దులు నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్.. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాలైన చేవెళ్ల, మెదక్, మల్కాజిగిరి ఎంపీలు బీజేపీ వాళ్లే ఉన్నారని.. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారని.. అయినా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎందుకు నిధులు అడగడం లేదని సీఎం ప్రశ్నించారు.