డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణ హౌసింగ్‌ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన రాము నాయక్ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది. 2013 నుంచి 2018 వ‌ర‌కు డిప్యూటేష‌న్‌పై హౌసింగ్ బోర్డులో భూసేకరణ అధికారిగా పనిచేసిన రాము నాయక్.. ఆ సమయంలో అనేక‌ భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్వహించిన విచారణలో తేలిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కంచెను చేను మేసిన‌ట్లుగా రాష్ట్ర ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. హైద‌రాబాద్ కోర్ అర్బన్ ప‌రిధిలో (క్యూర్ పరిధిలో).. ఇందిర‌మ్మ ఇళ్లను నిర్మించడం కోసం హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తుండగా భూ దందాలు బ‌య‌టికి వ‌చ్చినట్లు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. బ‌హిరంగ మార్కెట్లో గ‌జం రూ.2 లక్షలు పలుకుతున్న హైకోర్టు గేట్ల వద్ద హౌసింగ్ బోర్డుకు చెందిన 33.53 చ‌ద‌ర‌పు గ‌జాల‌ స్థలాన్ని 2018 ఫిబ్రవ‌రి 17వ తేదీన రాము నాయక్ అక్రమంగా రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. హౌసింగ్ బోర్డులో వ‌ర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ప‌నిచేసి సస్పెండ్ అయిన ఇఫ్తాక‌ర్ అహ్మద్ భార్య పేరు మీద ఆ భూమిని నిబంధనలను అతిక్రమించి రిజిస్ట్రేషన్ చేసినట్లు వెల్లడైంది. అదే భూమిని 2025లో మరొకరి పేరు మీదికి మార్చినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. ఆ భూమికి సంబంధించిన ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌కుండానే అప్పటి చార్మినార్ స‌బ్ రిజిస్ట్రార్‌.. రిజిస్ట్రేష‌న్ చేశారని.. దీనిపై ఆ సబ్ రిజిస్ట్రార్‌ పైన కూడా విచార‌ణ‌కు ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ రాము నాయిక్ చేస్తున్న భూ ఆక్రమణలపై 2017 నుంచే ప‌లు కేసులు నమోదైనట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. అయినప్పటికీ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిపై స్పందించ‌లేద‌ని, విచారణ జరపలేదని తెలిపారు. మ‌హ‌బూబ్ గంజ్‌లో 497 గ‌జాలు.. విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలో 400 చ‌ద‌ర‌పు గ‌జాలు.. ల‌క్ష్మిగూడ‌లో 130 గ‌జాలు.. తుల్జాగూడ‌లో 22 గ‌జాల విస్తీర్ణంలో ఉన్న భూములను.. ప‌లువురి పేరు మీద.. రాము నాయక్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఆ భూములన్నింటిపైనా విచార‌ణ చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో స్థానిక స‌బ్ రిజిస్ట్రార్‌ల పాత్ర ఉందా అనేదానిపై కూడా విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ల శాఖ ఐజీకి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాము నాయక్‌పై ప్రస్తుతం సస్పెన్షన్ వేటు వేశామని.. పూర్తిస్థాయిలో విచార‌ణ జరిపి.. అన్ని రకాల ఆధారాల‌ను నిర్ధారించుకున్న త‌ర్వాత‌.. అతడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని పేర్కొన్నారు. రాము నాయక్ చేస్తున్న భూ అక్రమాలకు స‌హ‌క‌రించిన సూప‌రింటెండెంట్ వివేకానంద్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినట్లు తెలిపారు. మ‌రో సూప‌రింటెండెంట్ బోనా నాయక్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినా, ఆక్రమణదారులకు సహాయం చేసినా వదిలిపెట్టేది లేదని.. వారు ఏ హోదాలో ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులే ఇలాంటి అక్రమాలకు పాల్పడితే మరింత కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని.. క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు శాఖాపరంగా కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.