దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన భాగస్వామ్య పక్షాల భేటీకి మొత్తం 23 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో అగ్రనేత మాట్లాడుూ.. ‘ఐకమత్యమే మహాబలం’అనే సందేశం ఇచ్చారు. ‘కలిసుంటే బలం.. విడిపోతే పతనం’ అని ఆయన నొక్కి చెప్పారు. మన ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీ నుంచి ఎదురయ్యే సవాలును తిప్పికొట్టడానికి మిత్రపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. అలాగే, మిత్రపక్షాలను ఒకరినొకరు కించపరచుకోవద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘‘దేశం, రాజ్యాంగ పరిరక్షణ కోసం’’ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 15 నిమిషాల పాటు ప్రసంగించిన రాహుల్.. ‘ఓట్ చోరీ’ సహా కొన్ని అంశాల్లో కూటమిలోని కొన్ని భాగస్వామ్య పార్టీల నుంచి కాంగ్రెస్‌కు సరైన మద్దతు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల వంటి పార్టీలపై రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్టు వర్గాలు తెలిపాయి.ఇక, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు సంబంధించిన ఆందోళనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలనే ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ లేఖను వీలైనంత త్వరగా ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలని ఇండియా కూటమి భావిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తూ బీజేపీని 'ఓడించడం కష్టం' కాదని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. నిరంతర అంతర్గత కలహాల ద్వారా ప్రతిపక్షం తనను తాను బలహీనపరుచుకోకుండా ఉండాలని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. 2019లో ఆ పార్టీ సొంతంగా 303 స్థానాల్లో గెలిచింది. ఇక, కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలిచి, 2019 కంటే (52) మెరుగైన ఫలితాలు సాధించింది.కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడం లోక్‌సభలో ఐక్యతకు తాజా ఉదాహరణ. ‘‘2026 ఏప్రిల్ 17న మోదీ ప్రభుత్వ దురుద్దేశపూరిత డీలిమిటేషన్ బిల్లులను ఓడించడానికి మనమందరం ఏకమై లోక్‌సభలో మన ఐక్యతను, సంఘీభావాన్ని చాలా నిర్ణయాత్మకంగా ప్రదర్శించాం. ఇప్పుడు మనం అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలి. తద్వారా మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను మనం ఎదుర్కోగలుగుతాం’’ అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని కూటమి నిర్ణయించుకుంది. తదుపరి సమావేశం ఆగస్టు 8న హైదరాబాద్‌లో జరగనుంది.నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెల రోజుల తర్వాత ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. ఇక, అసోం, పశ్చిమ్ బెంగాల్‌లో బీజేపీ, కేరళలో కాంగ్రెస్, తమిళనాడు విజయ్ పార్టీ విజయం సాధించాయి.