తమిళనాడు ఎన్నికల ఫలితాలపై మాజీ ఏపీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఎన్. ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తమిళనాడులో టీవీకే విజయ్ సరైన సమయంలో రాజకీయాల్లోకి వచ్చారని రఘువీరారెడ్డి అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తాను ఉన్నానంటూ విజయ్ సరైన సమయంలో రాజకీయ రంగప్రవేశం చేశారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి 2009లో రాకుండా 2014లో రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. రాంగ్ టైమ్‌లో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక దళపతి విజయ్ యూత్ కాంగ్రెస్‌లో చేరతానని.. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటూ గతంలో రాహుల్ గాంధీ వద్దకు వచ్చారని రఘువీరారెడ్డి వెల్లడించారు. బీజేపీ సిద్ధాంతాలకు విజయ్ ముందు నుంచి వ్యతిరేకమన్నారు. తమిళనాడులో విజయ్ తన కార్యక్రమాల ద్వారా నెట్ వర్క్ పెంచుకుంటూ వచ్చి అక్కడి ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించారని విశ్లేషించారు. అదే తమిళనాడులో టీవీకే విజయానికి కారణమైందన్నారు. తమిళనాడు ఎన్నికలకు ముందు పార్టీ ఆదేశాలతో తాను తమిళనాడులో పర్యటించానన్న రఘువీరారెడ్డి.. అప్పుడే విజయ్ ప్రభావం తనకు తెలిసిందన్నారు. డీఎంకేకు అవకాశం లేదని.. విజయ్‌తో ఏ పార్టీ కలిసి వెళ్లినా విజయం సాధిస్తారని తనకు అర్థమైందన్నారు. ఈ విషయాన్ని తాను ఢిల్లీలోని అధిష్టానం పెద్దలకు కూడా చెప్పినట్లు తెలిపారు. అయితే కూటమి ధర్మానికి లోబడి డీఎంకేతో కలిసి వెళ్లినట్లు వివరించారు.ఆ తప్పుతోనే ఏపీ ఎన్నికల్లో మాకు దెబ్బ .. రఘువీరారెడ్డి"2018లో ఏపీలో కాంగ్రెస్ ఓటింగ్ శాతం 8 నుంచి 9 శాతానికి పెరిగిందని మా సర్వేలలో తేలింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలలోనూ ఇదే విషయం వెల్లడైంది. అది గమనించిన చంద్రబాబు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అక్కడ సక్సెస్ అయితే ఏపీలోనూ కలిసి వెళ్దామని అనుకున్నారు. అయితే తెలంగాణలో పొత్తు బెడిసికొట్టింది. ఇక్కడ మాపై విశ్వసనీయత పోయింది. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోయి ఉంటే 2019లో ఏపీలో కొంతమంది కాంగ్రెస్ తరుఫున అసెంబ్లీలో అడుగుపెట్టేవారు." అని రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు.