కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా రైల్వేలను విస్తరించడం, ఉన్న మార్గాలను అప్‌గ్రేడ్ చేసే పనుల్లో పడింది. ఈ నేపథ్యంలోనే దేశంలో రైల్వే నెట్‌వర్క్‌ను పెంచడంతోపాటు.. ట్రాక్‌లు, రైలు సర్వీసులను భారీగా పెంచేందుకు అనేక ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే పరిధిలో కూడా ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ రైల్వే సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను మరింత పెంచేందుకు ఒక భారీ ప్రాజెక్టును తాజాగా రైల్వే శాఖ మంజూరు చేసింది. ప్రస్తుతం మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో ఉన్న 1x25 కేవీ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మరింత ఆధునీకరించాలని నిర్ణయించింది. దీన్ని 2x25 కేవీ ట్రాక్షన్ వ్యవస్థగా అప్‌గ్రేడ్ చేసేందుకు పచ్చజెండా ఊపింది. సుమారు 141 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే సెక్షన్‌లో.. విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.285.01 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేపట్టనుంది. దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే రైలు మార్గాల్లో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ 2x25 కేవీ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా రైళ్ల నిర్వహణకు విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా, సమర్థవంతంగా అందుతుందని రైల్వే శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల రైలు సర్వీసులు మరింత సురక్షితంగా, సాఫీగా సాగుతాయని తెలిపాయి. దేశంలోనే అత్యంత కీలకమైన హై డెన్సిటీ నెట్‌వర్క్ (హెచ్డీఎన్) మార్గాల్లో ఒకటిగా ఉన్న ఈ మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్.. ధర్మవరం-డోన్-మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్-ముద్ఖేడ్-ఇండోర్-అజ్మీర్ రైల్ కారిడార్ పరిధిలో ఉంది. ఈ మార్గంలో ప్రతీ రోజు భారీ సంఖ్యలో ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్లు కూడా పరుగులు తీస్తూ ఉంటాయి.ఈ మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ పూర్తి అయి అందుబాటులోకి వస్తే.. ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి. మరీ ముఖ్యంగా సరుకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా సాగుతుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. మరింత వేగంగా రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడం ద్వారా ఈ రైల్వే కారిడార్ వెంబడి.. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఊతం ఇవ్వడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని చెబుతున్నాయి. ఆధునిక, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఈ రైల్వే నెట్‌వర్క్‌ను డెవలప్ చేయాలని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాజెక్టు మరింత బలాన్ని ఇవ్వనుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రయాణికులకు మాత్రమే కాకుండా.. పరిశ్రమలకు కూడా చాలా ప్రయోజనం దక్కనుంది.