: సీనియర్ సిటిజెన్లు ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తుంటారు. ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండదు. ఇంకా నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. నిర్దిష్ట టెన్యూర్లకు గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఇక సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు దాదాపు 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ అధికంగా వస్తుంది. ఆర్బీఐ కొంత కాలంగా రెపో రేట్లను తగ్గిస్తూ వస్తున్నప్పటికీ.. సీనియర్ సిటిజెన్లకు ఇప్పటికీ ఆకర్షణీయ స్థాయిల్లోనే వడ్డీ రేట్లు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల్లో.. అదే విధంగా ప్రైవేట్ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సీనియర్ సిటిజెన్లకు దేశంలోని ఏ బ్యాంకులో ఏ టెన్యూర్‌పై అధిక వడ్డీ ఉంది.. ఎంత ఉందనేది చూద్దాం. అత్యధికంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఉండగా.. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో అత్యధికంగా 21 నెలల ఒక రోజు నుంచి 22 నెలల డిపాజిట్లపై అత్యధికంగా 8.30 శాతం వడ్డీ రేటు ఉంది. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 888 రోజులకు అత్యధికంగా 8.25 శాతం వడ్డీ రేటు ఉంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 2-3 ఏళ్ల డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటు సీనియర్ సిటిజెన్లకు ఉంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వరుసగా 30 నెలలు, 666 రోజుల టెన్యూర్లపై అధికంగా 8.25 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రైవేట్ బ్యాంకుల్లో చూస్తే డీసీబీ బ్యాంకులో అత్యధికంగా 24- 25 నెలలు, 34-35 నెలలు, 60- 61 నెలల డిపాజిట్లపై 8 శాతం వడ్డీ రేటు ఉంది. ఎస్బీఎం బ్యాంక్ ఇండియాలో 18 నెలల నుంచి 2 ఏళ్ల 3 రోజుల వరకు డిపాజిట్లపై అత్యధికంగా 7.8 శాతం వడ్డీ రేటు ఉంది. బంధన్ బ్యాంకు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్, యెస్ బ్యాంకులో అత్యధికంగా 7.75 శాతంగా వడ్డీ రేట్లు ఉండగా.. టెన్యూర్లు వరుసగా 2-5 ఏళ్లు, 2-3 ఏళ్లు, 888 రోజులు, 18-24 నెలలుగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకులో అత్యధికంగా 3-5 ఏళ్ల వ్యవధిపై అత్యధికంగా 7.1 శాతం వడ్డీ రేటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 3 ఏళ్ల ఒక రోజు నుంచి నాలుగేళ్ల 7 నెలల డిపాజిట్లపై 7 శాతం, యాక్సిస్ బ్యాంకులో 5-10 ఏళ్లకు 7.2 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 ఏళ్ల డిపాజిట్లపై సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా 7.45 శాతం వడ్డీ రేటు ఉంది. ఇండియన్ బ్యాంకులో 555 రోజులకు 7.3 శాతం వడ్డీ ఇస్తుంది. పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో 666 రోజుల డిపాజిట్లపై 7.25 శాతంగా వడ్డీ రేటు ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5-10 ఏళ్ల డిపాజిట్లపై అత్యధికంగా 7.05 శాతంగా వడ్డీ రేటు ఉంది.