యునైటెడ్ కింగ్డమ్‌లో భారీ భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ప్రధాన మంత్రి ఉపయోగించే ప్రభుత్వ వాహనంలో చైనా ట్రాకింగ్ డివైజ్‌ను బ్రిటిష్ నిఘా అధికారులు గుర్తించారు. లొకేషన్ డేటాను పంపగల ఈ పరికరం.. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఒక సీల్డ్ కాంపోనెంట్‌లో అమర్చ ఉందని, తనిఖీల్లో బయటపడటానికి ముందు సుమారు నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తోందన్న టెలిగ్రాఫ్ నివేదిక సంచలనంగా మారింది. విదేశీ గూఢచర్య ముప్పును తిప్పికొట్టేందుకు నిఘా అధికారులు, భద్రతా సిబ్బంది ప్రభుత్వ, దౌత్య అధికారుల వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ నెట్‌వర్క్ బయటపడింది.టెలిగ్రాఫ్ ఉటంకించిన నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. వాహన తయారీదారుకు ఆ విడిభాగాన్ని పంపే ముందే చైనాకు చెందిన ఓ సబ్-సప్లయర్ ఆ ట్రాకింగ్ పరికరాన్ని ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU)లో అమర్చాడు. యూనిట్ సీల్ చేసి ఉండటం వల్ల వాహన తయారీదారుకు తెలియకుండానే దానిని ఆ వాహనంలో అమర్చారు. బ్రిటన్ మాజీ మంత్రి డంకన్ స్మిత్ కూడా దీనిని ధ్రువీకరించారు. ప్రధాని అధికారిక వాహనాలైన రేంజ్ రోవర్ సెంటినెల్స్‌లో ఉన్న ఈ డివైజ్‌లను గుర్తించడానికి భద్రతా దళాలు వాటి భాగాలను పూర్తిగా విడదీయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ఈ గూఢచర్యం కేవలం ప్రధాని కారుకు మాత్రమే పరిమితం కాలేదని, పాశ్చాత్య సరఫరా గొలుసులను దెబ్బతీయడానికి చైనా అవలంబిస్తున్న ఒక విస్తృతమైన, ఆటోమేటెడ్ వ్యూహంలో భాగమని నిఘా అధికారులు భావిస్తున్నారు. విడి భాగాలను భారీ ఎత్తున తయారు చేస్తారు కాబట్టి సాధారణ పౌరుడిదైనా లేదా ఒక దేశ ప్రధానిదైనా వీటిని ఉపయోగించే ప్రతి వాహనం కూడా ఒక ట్రాకింగ్ పరికరంగా మారిపోతుంది.ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో చైనా పట్ల కఠినంగా వ్యవహరించాలనే ఒత్తిడి బ్రిటన్ ప్రభుత్వంపై విపరీతంగా పెరుగుతోంది. చైనాను కేవలం వ్యవస్థాగత సవాల్‌గా మాత్రమే కాకుండా వ్యవస్థాగత ముప్పుగా భావించాలని ప్రముఖ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఇవన్నీ తప్పుడు నివేదికలని, అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. తమ టెక్ సంస్థలపై బురదజల్లడానికి పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు జాతీయ భద్రతా ఆందోళనలను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.ఆరోపణలను చైనా ఖండించినప్పటికీ నాలుగేళ్ల పాటు జరిగిన ఈ భద్రతా వైఫల్యం నేపథ్యంలో అన్ని కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలలో ఉపయోగించిన సాంకేతిక పరికరాలు, విడి భాగాలపై లోతైన సమీక్ష ప్రారంభించింది. అయితే, 2023లోనూ బ్రిటన్ మంత్రులు, ప్రభుత్వంపై చైనా గూఢచర్యం విషయం వెలుగులోకి వచ్చింది.