కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. సింగరేణి సంస్థకు గుడ్‌న్యూస్ చెప్పింది. రామగుండం బొగ్గు గని (ఆర్‌జీ కోల్‌మైన్) పేరుతో సింగరేణి సంస్థ తయారు చేసిన కొత్త ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రామగుండం బొగ్గు గని ప్రాజెక్టుకు అన్ని పర్యావరణ అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ రామగుండం బొగ్గు గని ప్రాజెక్టు కోసం 4326.08 హెక్టార్ల భూమి అవసరం కావడంతో.. అది సేకరించేందుకు పర్యావరణ అనుమతులు కావాల్సి ఉండగా.. తాజాగా ఆ అనుమతులను కేంద్రం ఇవ్వడంతో బొగ్గును తవ్వుకునేందుకు మార్గం సుగమం అయింది. సింగరేణి సంస్థ పరిధిలో బొగ్గు తవ్వకాలు తగ్గడంతో.. ఉత్పత్తి పడిపోయింది. దీంతో సింగరేణి వ్యాపారం కూడా తగ్గడంతో.. సింగరేణి ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం బొగ్గు గని ప్రాజెక్టును కేంద్రం అంగీకరించడంతో.. సరికొత్త ఉత్సాహం నెలకొంది. మొత్తం రూ.2,194.05 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ఆర్‌జీ కోల్‌మైన్ ప్రాజెక్టులో 5403 మంది సింగరేణి ఉద్యోగులతోపాటు.. మరో 600 మంది కాంట్రాక్ట్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రామగుండం ప్రాంతంలో పాత బొగ్గు గనులు మూతపడుతుండగా.. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేరే ప్రాంతాల్లో పని కల్పించడంతోపాటు.. బొగ్గు ఉత్పత్తి తగ్గడంతో మళ్లీ పెంచేందుకు ఈ ఆర్‌జీ కోల్‌మైన్‌ ప్రాజెక్ట్ చాలా కీలకమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 గనుల్లో బొగ్గును తవ్వనున్నారు. అందులో రెండు ఉపరితల (ఓపెన్ కాస్ట్).. మరో 3 భూగర్భ గనుల (అండర్‌గ్రౌండ్ మైన్స్)లను తవ్వకం కోసం ఈ ప్రాజెక్టును రూపొందించారు. అక్కడ మొత్తం 314.98 మిలియన్‌ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్‌జీ కోల్‌మైన్ ప్రాజెక్టులో భాగంగా ప్రతీ సంవత్సరం 2.10 కోట్ల టన్నుల చొప్పున బొగ్గును 25 ఏళ్ల పాటు తవ్వాలని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రక్రియ ప్రారంభం అయితే.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తోపాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలకు కూడా ఇంధన సరఫరా ఒప్పందాల ప్రకారం బొగ్గును సరఫరా చేయనున్నారు. ఇక.. గతంలో మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్.. త్వరలో మూతపడే స్థితిలో ఉన్న వకీల్‌పల్లి భూగర్భ గనులను కూడా.. ఓపెన్ కాస్ట్‌ బొగ్గు గనులుగా మార్చి.. అక్కడ మిగిలి ఉన్న బొగ్గును కూడా పూర్తిగా వెలికితీయాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా ఈ గనులను ఆనుకొని పక్కనే ఉన్న రామగుండం ఓపెన్‌ కాస్ట్‌-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్‌ 2.. రామగుండం ఓపెన్‌ కాస్ట్‌-2 విస్తరణ ప్రాజెక్టు.. అడ్రియాల షాఫ్ట్‌ అండర్‌ గ్రౌండ్‌ విస్తరణ ప్రాజెక్టుల అంచుల్లో మిగిలిపోయిన బొగ్గును కూడా పూర్తిగా తవ్వేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టులను అన్నింటినీ కలిపి రామగుండం కోల్‌మైన్‌ పేరుతో కొత్త ప్రాజెక్టుకు గతంలోనే రూపకల్పన చేసిన సింగరేణి సంస్థ.. వాటికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తక్కువ పెట్టుబడితో.. పర్యావరణానికి హాని జరగకుండా బొగ్గును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ఆర్‌జీ కోల్‌మైన్ ప్రాజెక్టును రూపొందించినట్లు కేంద్రానికి విన్నవించింది.