ఏపీలో స్కూల్స్‌కు వేసవి సెలవులు పొడిగింపు.. ప్రభుత్వానికి లేఖ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ పునఃప్రారంభం వాయిదా వేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోందని గుర్తు చేస్తూ బీజేపీ శాసనసభా పక్ష నేత ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని.. అందుకే ఈ నెల 12న పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన విద్యశాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ నెల 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారాలు సెలవులు ఉన్నాయి కాబట్టి 15 కానీ, 17కు కానీ స్కూళ్ల రీ ఓపెనింగ్‌ను వాయిదా వేయాలన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విద్యాశాఖ అధికారులకు లేఖ రాసినట్లు విష్ణుకుమార్‌రాజు తెలిపారు. అంతేకాదు అధికారులు స్కూళ్లు పునఃప్రారంభానికి ముందే తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు వంటి సదుపాయాలు సరిగా ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించాలని సూచించారు విష్ణుకుమార్‌రాజు. మరి ఈ వినతిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.మరోవైపు. రాష్ట్రంలో స్కూల్స్‌కు వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత ఈ నెల 12 నుంచి స్కూల్స్ తిరిగి తెరుచుకోవాల్సి ఉంది. ఈనెల 12వ తేదీకి బదులుగా 15న రీ ఓపెన్ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 12వ తేదీన సెలవు ఇచ్చినందున.. దాని బదులు జులై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.ఏపీలో ఈ నెల 8 నుంచి 10 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం కమిషనర్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు మినహా మిగతా 24 జిల్లాల్లోనూ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుందని ఆయన తెలిపారు.