Ambani Stocks: భారత్‌లో అత్యంత ధనవంతులు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ. అయితే గతంలో ఒక దశలో రాణించడంతో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మించి అదానీ గ్రూప్ బాస్ సంపద పెరిగిన సంగతి తెలిసిందే. ఒక దశలో ప్రపంచ కుబేరుల్లోనే 2-3 స్థానాల్లోకి కూడా ఎగబాకారు. తర్వాత హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా.. ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోగా.. అదానీ సంపద కూడా పడిపోతూ వచ్చింది. తర్వాత్తర్వాత భారీగా తగ్గుతూ టాప్- 30 అవతలికి పడిపోయారు. అప్పటి నుంచి కొన్నేళ్లుగా ముకేశ్ అంబానీనే.. భారత్ సహా ఆసియాలో కూడా అత్యంత ధనవంతుడుగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఇన్నాళ్లకు ఆ హోదాను కోల్పోయారు రిలయన్స్ బాస్. గౌతమ్ అదానీ ఇప్పుడు భారతదేశంలో సహా ఆసియాలో కుబేరుడిగా అవతరించారు. అదానీ గ్రూప్ స్టాక్స్ కొంత కాలంగా భారీగా పెరిగిన క్రమంలో ఆయన సంపద పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత సహా సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్‌ను దాటేశారు.ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం.. ప్రస్తుతం అదానీ సంపద 90 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 8.57 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. ఇక ముకేశ్ 88.8 బిలియన్ డాలర్లుగా భారత కరెన్సీలో ఇది రూ. 8.46 లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు జపాన్ బిలియనీర్ మసయోషి సన్ నికర సంపద 81 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో రూ. 7.71 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వీరు వరుసగా 22, 24, 26 స్థానాల్లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ 788.8 బిలియన్ డాలర్లతో ఉన్నారు. ఇది భారత కరెన్సీలో చూస్తే రూ. 75 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. అదానీ గ్రూప్ స్టాక్స్ ర్యాలీ..తాజాగా సాఫ్ట్‌బ్యాంక్ షేర్లు భారీగా పడిపోవడంతోనే మసయోషి సన్ సంపద తగ్గగా.. అదానీ, అంబానీ ఆయనను అధిగమించారు. జూన్ 8 సెషన్‌లో ఒక్కరోజే గ్రూప్ షేర్లు 8 శాతం వరకు కుదేలయ్యాయి. మరోవైపు అదానీ గ్రూప్ స్టాక్స్ ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. శుక్రవారం రోజు అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 7 శాతం వరకు పెరగ్గా.. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 4 శాతం.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ 2 శాతం వరకు ఎగబాకాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చాలా వరకు అదానీ గ్రూప్ స్టాక్స్ 23-56 శాతం వరకు పెరిగాయి. మరోవైపు దీనికి భిన్నంగా రిలయన్స్ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18 శాతం పడిపోగా.. ఆయన సంపద భారీగా తగ్గింది.