100 రోజుల్లో మూసీ ప్రక్షాళన ఫేజ్-2 పనులు.. 122 కి.మీ మేర మెట్రో విస్తరణ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Wait 5 sec.

హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రూ. 1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఈ పనులను ప్రారంభించారు. ఉప్పల్ భగాయత్ ఫేజ్-IIIలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్లతో నిర్మించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనానికి సీఎం పునాది రాయి వేశారు. దీంతో పాటు రూ. 960 కోట్లతో AOC సెంటర్‌లో ప్రత్యామ్నాయ రోడ్లు, రూ. 416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద 6 వరుసల ఫ్లై ఓవర్, రూ. 37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా క్యూర్-1 అనే ప్రత్యేక యాప్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు.మూసీ నది పునరుజ్జీవంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 పనులను రాబోయే 100 రోజుల్లోగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో సబర్మతి, యమున, గంగా నదులను ప్రక్షాళన చేసుకున్నప్పుడు.. మన మూసీని ఎందుకు మార్చలేం? అని సీఎం ప్రశ్నించారు. 55 కిలోమీటర్ల మేర మూసీని ప్రక్షాళన చేయడం ద్వారా యువతకు ఉపాధి పెరగడమే కాకుండా కాలుష్య కోరల్లో చిక్కుకున్న నల్గొండ జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. ఈ ప్రక్రియలో ఇళ్లు కోల్పోయే ఏ ఒక్క పేదవాడికీ అన్యాయం జరగనివ్వమని వారికి ప్రత్యామ్నాయ ఇళ్లు, పిల్లలకు చదువు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.గతంలో మల్కాజిగిరి ప్రాంతంలో పంచాయతీలు, మున్సిపాలిటీల మధ్య సమన్వయం లేక అభివృద్ధి కుంటుపడిందని సీఎం గుర్తుచేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ప్రకారం ఓఆర్ఆర్ లోపల ఉన్న 2100 చ.కి.మీ ప్రాంతాన్ని క్యూర్ జోన్‌గా గుర్తించినట్లు చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం దీనిని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు మున్సిపల్, పోలీస్ కార్పొరేషన్లుగా వికేంద్రీకరించినట్లు ప్రకటించారు.నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు 122 కి.మీ మేర మెట్రో రైలును విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు, అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను కనెక్ట్ చేస్తామన్నారు. అయితే ఈ అభివృద్ధి పనులకు, రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తాను గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు చేయలేకపోయిన పనులను ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నిధుల కొరత లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.